మక్తల్ : విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలుకి తీయడం కోసం వేసవి శిక్షణ శిబిరాల (Summer training camp) ఏర్పాటని మక్తల్ మండల విద్యాధికారి అనిల్ గౌడ్ (MEO Anil Goud) అన్నారు. మక్తల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం పాఠశాల హెచ్ఎం నాగేశ్వర్ అధ్యక్షతన జరిగిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో దాగివున్న ప్రతిభను వెలుకి తీయడం కోసమే ప్రభుత్వం వేసవి శిక్షణ క్రీడా శిబిరాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ శిక్షణ శిబిరంలో ఖోఖో, అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, కరాటే వంటి శిక్షణను విద్యార్థులకు అందించామని చెప్పారు.
ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే భవిష్యత్లో క్రీడా సర్టిఫికెట్లు ఉపయోగపడతాయని వెల్లడించారు. ఈ సందర్భంగా వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమొంటోలను, సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రసన్న, పరంజ్యోతి, రాజేశ్వరి, భాగ్య, భారతి, కరాటే మాస్టర్ విజయ్ కుమార్, విద్యార్థులు తదితరులు ఉన్నారు.