IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్ ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) విజయదుందుభి మోగించింది. రికార్డ్ బ్రేకర్‌గా పేరొందిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)ను చిత్తుగా ఓడించి మూడో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. కోల్‌కతా చాంపియన్‌గా నిలవడం వెనక మెంటార్ గౌతం గంభీర్(GG) పాత్రపై కించిత్ అనుమానం కూడా అక్కర్లేదు. శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)సేన టైటిల్ విక్టరీలో గౌతీతో పాటు క్రెడిట్ దక్కాల్సిన మరో వ్యక్తి ఉన్నాడు. హైదరాబాద్‌పై విజయానంతరం సంబురాల్లో మునిగిపోయిన కోల్‌కతా ఆటగాళ్లంతో ముక్తకంఠంతో చెప్పిన ఒకే ఒక పేరు.. అభిషేక్ నాయర్(Abhishek Nair).
కోల్‌కతా అసిస్టెంట్ కోచ్ అయిన అభిషేక్ ఆటగాళ్లను రేసుగుర్రాల మాదిరిగా తీర్చిదిద్దాడు. ఒత్తిడిలోనూ ఆత్మవిశ్వాసంగా ఉండడం, కష్టమైన పరిస్థితుల్లోనూ ధైర్యంగా పోరాడడం వంటి లక్షణాలను వాళ్లకు నూరిపోశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు అందరికీ బ్యాటింగ్, టెక్నిక్ పరమైfన సర్దుబాట్లు చేశాడు.
అందుకే కాబోలు.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నుంచి వెంకటేశ్ అయ్యర్, కుర్రాడు రుఘువంశీ వరకూ అందరూ ఈ విజయంలో అభిషేక్ పాత్ర ఎంతో ఉందని అన్నారు. చక్రవర్తి మాట్లాడుతూ.. కోల్‌కతా జట్టులోని భారత కుర్రాళ్లకు అభిషేక్ అండగా నిలిచాడు. అతడి ప్రోత్సాహం, సలహాల వల్లనే మేమంతా అద్భుతంగా రాణిస్తున్నాం అని అభిషేక్‌ను ఆకాశానికెత్తేశాడు.
లెఫ్డ్ హ్యాండ్ బ్యాటర్ అయిన అభిషేక్ 2009లో టీమిండియా తరఫున తొలి వన్డే ఆడాడు. ఆల్‌రౌండర్‌గా జట్టులో పాతుకుపోతాడు అనుకుంటే అదే ఏడాది సెప్టెంబర్‌తో అతడు బ్లూ జెర్సీకి దూరమయ్యాడు. అనంతరం ఐపీఎల్‌పై దృష్టి పెట్టిన అభిషేక్ 2018లో కోల్‌కతా క్యాంప్‌లో చేరాడు. అప్పటి నుంచి ఫ్రాంచైజీ కొన్న కుర్రాళ్లలో మెలకువలు పెంపొందించడమే పనిగా శ్రమించాడు. అభిషేక్ శిక్షణలోనే చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్‌లు మరింత రాటుదేలారు. ఆరేండ్ల అతడి కష్టానికి 2024లో కోల్‌కతా ట్రోఫీ గెలవడంతో ఫలితం దక్కినట్టైంది.