ఈ సీజన్లో అంచనాలకు మించి రాణిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) శనివారం సొంత ఇలాఖాలో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఐపీఎల్-17లో ప్లేఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో సమిష్టిగా రాణించి తొమ్మిదో విజయంతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో మొదట వెంకటేశ్, నితీశ్ దూకుడుతో భారీ స్కోరు చేసిన కేకేఆర్.. ఆ తర్వాత బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో ముంబైని చిత్తుచేసింది.
IPL | కోల్‌కతా: ఐపీఎల్-17లో వరుస విజయాలతో దూకుడు మీదున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో ప్లేఆఫ్స్ బెర్తును దక్కించుకున్న తొలి జట్టుగా నిలిచింది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ సేనను 18 పరుగుల తేడాతో ఓడించడంతో కేకేఆర్.. 2021 తర్వాత మళ్లీ నాకౌట్ దశకు చేరుకుంది. వర్షం అంతరాయం వల్ల 16 ఓవర్లకే కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (21 బంతుల్లో 42, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), నితీశ్ రాణా (23 బంతుల్లో 33, 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. అనంతరం ఛేదనకు దిగిన ముంబై.. 16 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమై ఈ సీజన్లో 9వ ఓటమిని మూటగట్టుకుంది. ఇషాన్ కిషన్ (22 బంతుల్లో 40, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (17 బంతుల్లో 32, 5 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించారు. వరుణ్ చక్రవరిక్తి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతాకు ఓపెనర్లు సాల్ట్ (6), నరైన్ (0) ఆశించిన ఆరంభం ఇవ్వలేదు. కేకేఆర్ ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ కొట్టిన సాల్ట్.. మొదటి ఓవర్లోనే భారీ షాట్ ఆడి కంబోజి చేతికి చిక్కాడు. నరైన్‌ను అద్భుత బంతితో బుమ్రా బోల్తొ కట్టించాడు. కంబోజ్ వేసిన ఐదో ఓవర్లో తొలి బంతి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (7) బౌల్డ్ చేసి కేకేఆర్‌కు షాకిచ్చాడు. కానీ ముంబై అంటేనే విరుచుకుపడే వెంకటేశ్ అయ్యర్ ఆ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. నితీశ్ రాణా అండతో కేకేఆర్ ఇన్నింగ్స్‌ను గాడినపెట్టాడు. హాఫ్ సెంచరీకి చేరువైన వెంకటేశ్‌ను చావ్లా ఔట్ చేయగా రాణాను తిలక వర్మ రనౌట్ చేశాడు. ఉన్నంతసేపు రస్సెల్ (24) మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో రింకూ సింగ్ (20), రమణ్‌దీప్ (17 నాటౌట్) మెరుపులతో కేకేఆర్ భారీ స్కోరు సాధించింది.
ఛేదనలో ముంబై ఆదినుంచే కోల్‌కతా బౌలర్లపై ఎదురుదాడికి దిగినా తర్వాత తడబడింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (19) ధాటిగా ఆడారు. హర్షిత్ రాణా 4వ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో దూకుడుగా ఆడిన ఇషాన్.. నరైన్ 5వ ఓవర్లో 4,6 తో రెచ్చిపోయాడు. కానీ అతడే వేసిన ఏడో ఓవర్లో ఇషాన్.. రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రోహిత్‌ను చక్రవర్తి ఔట్ చేశాడు. ఇక అక్కడ్నుంచి ముంబై వేగంగా వికెట్లు కోల్పోయిం ది.ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ (11)ను ఆండ్రీ రస్సెల్ వెనక్కి పంపాడు. హార్దిక్ పాండ్యా (2), టిమ్ డేవిడ్ (0), నెహల్ వధెరా (3) విఫలమవడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.
కోల్‌కతా: 16 ఓవర్లలో 157/7 (వెంకటేశ్ 42, నితీశ్ 33, చావ్లా 2/28, బుమ్రా 2/39)
ముంబై: 16 ఓవర్లలో 139/8 (ఇషాన్ 40, తిలక్ 32, వరుణ్ 2/17, రస్సెల్ 2/34)