IPL 2025 : టీ20ల స్వరూపాన్నే మార్చేసిన ఐపీఎల్లో భారీ స్కోరింగ్ మ్యాచ్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఒకప్పుడు 200 కొడితే గొప్ప. కానీ, ఇప్పుడు 200 ప్లస్ స్కోర్లు నమోదు అవుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) నిరుడు ఏకంగా 287 రన్స్‌తో ఐపీఎల్లో చరిత్ర సృష్టించింది. ఈ మెగా లీగ్‌లో అత్యధిక స్కోర్ కొట్టిన జట్టుగా అవతరించింది.
ఇక 18వ ఎడిషన్ వచ్చేసరికి 300 పరుగులు సాధ్యమేనని విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్లో ‘తీన్ సౌ’ కొట్టేంత దమ్మున్న జట్టు సన్‌రైజర్స్ అని అందరూ అనుకుంటున్నారు. అయితే.. తమకు కూడా రికార్డు స్కోర్ చేయగల సత్తా ఉందని అంటున్నాడు రింకూ సింగ్ (Rinku Singh).
SRH nearly broke their highest-ever IPL score in an innings. 🥵
📸: JioHotstar pic.twitter.com/g99kHTtH4n
— CricTracker (@Cricketracker) March 23, 2025
‘సీజన్ సీజన్‌కు ఐపీఎల్లో రికార్డులు బద్ధలవుతున్నాయి. 200 ప్లస్ స్కోర్ల నుంచి 300 పరుగులు కూడా సాధ్యమేనని రోజులు వచ్చేశాయి. 18వ ఎడిషన్‌లో ఏదో ఒక జట్టు ట్రిపుల్ సెంచరీ కొడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నిరుడు పంజాబ్ కింగ్స్ 262 పరుగుల్ని ఛేదించి ఔరా అనిపించింది. ఈసారి ప్రతి జట్టు బలంగానే ఉంది. తలచుకుంటే ఏ టీమ్ అయినా 300 మార్క్ అందుకోగలదు’ అని రింకూ వెల్లడించాడు. 16వ సీజన్లో రింకూ విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించాడు. గుజరాత్ టైటాన్స్‌పై ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడీ ఫినిషర్. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ యశ్ దయాల్(Yash Dayal) వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాది కోల్‌కతాను గెలిపించాడు.
పదిహేడో సీజన్లో సన్‌రైజర్స్ బ్యాటర్లు శివాలెత్తిపోయారు. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల సునామీ సృష్టించారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మర్క్రమ్, క్లాసెన్ వీరవిహారం చేయడంతో కమిన్స్ సేన 3 వికెట్ల నష్టానికి 287 పరుగులతో రికార్డు బద్ధలు కొట్టింది. 18 ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఆరెంజ్ ఆర్మీ టాపార్డర్ చెలరేగడంతో 300 మార్క్ చేరుకోవడం ఖాయం అనుకున్నారంతా. కానీ, 286 రన్స్ చేసిన హైదరాబాద్.. గత రికార్డుకు ఒక్క పరుగుల దూరంలో ఆగిపోయింది.