Contract Lecturers | ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ అధ్యాపకులు చేస్తున్న సమ్మె శనివారంతో ఎనిమిదో రోజుకు చేరింది. ఓయూ పరిపాలన భవనం ముందు మహిళా ఆధ్యాపకులతో సహా అందరూ ఉదయం నుంచి ధర్నా నిర్వహించారు. ఓయూ అధికారులు తమ డిమాండ్లు నెరవేర్చకుండా శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపిస్తూ, దానిని నిరసిస్తూ ఓయూ పరిపాలన భవనం ముందు శ్రమదానం నిర్వహించారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మెకు మద్దతుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరై తన సంపూర్ణ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. దాదాపు 22 రోజులుగా ఆందోళన చేస్తూ, ఎనిమిది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుంటే ఈ రాష్ట్రంలోని పాలకులకు చీమ కుట్టినట్లైనా లేదా అని ప్రశ్నించారు. వారి ప్రాధాన్యత అంశాలలో విద్య ఉందా, లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖను స్వయంగా ముఖ్యమంత్రే తన దగ్గర పెట్టుకుని, నేనే విద్యామంత్రిని అని చెబుతూ విద్యార్థుల సమస్యలు, అధ్యాపకుల సమస్యలు, విద్యారంగానికి సంబంధించిన సమస్యలకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
డిగ్రీ అధ్యాపకులను రెగ్యులర్ చేసినప్పుడు రాని అడ్డంకులు, యూనివర్సిటీ అధ్యాపకులు రెగ్యులర్ చేయడానికి ఏ విధంగా అడ్డం వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరికీ అన్ని అర్హతలు ఉన్నాయని, ఎటువంటి న్యాయపరమైన చిక్కులు, ఉన్నత విద్యా నిబంధనలు గాని అడ్డురావని చెప్పారు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే అది ఒక పెద్ద విషయం కాదని అభిప్రాయపడ్డారు. వెంటనే అసెంబ్లీలో ఒక బిల్లుకు ఆమోదం తెలపడం ద్వారా దాన్ని మార్చుకోవచ్చని పేర్కొన్నారు. రాజ్యాంగంలోనే అనేక మార్పులు చేసిన మనం ఇంత మంది జీవితాల కోసం ఒక చిన్న ఆర్డినెన్స్ లాంటిది తీసుకురాలేమా అని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించే వరకు తామంతా వెంట ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం దిగివచ్చి వెంటనే వారి న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అధ్యాపక సంఘం నాయకులు డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ పరుశురాం, డాక్టర్ కుమార్, డాక్టర్ ఉపేందర్, డాక్టర్ విజేందర్ రెడ్డి, డాక్టర్ తాళ్లపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ వినీత పాండే, డాక్టర్ శైలజ రెడ్డి, డాక్టర్ నసీమా బేగం తదితరులు పాల్గొన్నారు.