Record Breakers of 2023 : అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఏడాదికి ఓ ప్రత్యేకత ఉంది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా 2023లో పెను సంచలనాలు నమోదయ్యాయి. పసికూన పపువా న్యూ గినియా (Papua New Guinea) తొలిసారి టీ20 వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించింది. వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్(ODI World Cup Qualifier)లో రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్(West Indies) బొక్కబోర్లా పడింది.
పసికూనగా ముద్రపడిన నేపాల్ టీ20ల్లో మరే జట్టుకు సాధ్యం కానిరీతిలో అత్యధిక స్కోర్‌తో ప్రకంపనలు రేపింది. బ్యాటర్ల విషయానికొస్తే.. వన్డేల్లో అత్యధిక సెంచరీలతో ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) చరిత్ర సృష్టించగా.. వరల్డ్ కప్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) వేగవంతమై సెంచరీతో రికార్డులను బద్ధలు కొట్టాడు.
ప్రపంచ క్రికెట్లో పరుగుల రారాజుగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ(Virat Kohli) వన్డేల్లో దాదాపు అసాధ్యమనుకున్న రికార్డు బద్దలు కొట్టాడు. 50 ఓవర్ల ఆటలో సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) పేరిట ఉన్న 49 శతకాల రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు.
సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup)లో దక్షిణాఫ్రికా సెంచరీతో చెలరేగిన కోహ్లీ.. మాస్టర్ బ్లాస్టర్ అధిగమించాడు. అంతేకాదు సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ రన్‌మెషిన్ సచిన్ 100 రికార్డుల సెంచరీలపై కన్నేశాడు. మరో 21 శతకాలు బాదితే ప్రపంచంలోనే అత్యధిక శతకాలు కొట్టిన క్రికెటర్‌గా అవతరిస్తాడు.
పసికూనగా ముద్రపడిన ఆసియా జట్టు నేపాల్(Nepal) ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో ప్రకంపనలు సృష్టించింది. పొట్టి ఫార్మాట్లో పెద్ద జట్లకు సాధ్యం కాని రికార్డును నెలకొల్పింది. ఆసియా గేమ్స్ పోటీల్లో మంగోలియాపై 300లకు పైగా స్కోర్ కొట్టింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ(Dipendra Singh Airee) టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో రికార్డుల్లోకెక్కాడు.
అతడు 9 బంతుల్లోనే 8 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. కుషాల్ మల్లా(137) సెంచరీతో విరుచుకుపడగా.. కెప్టెన్ రోహిత్ పౌడెల్(61), దీపేందర్ సింగ్ ఐరీ(52) రికార్డు హాఫ్ సెంచరీ బాదారు. దాంతో, నేపాల్ 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లోనే నేపాల్ 273 పరుగుల తేడాతో గెలుపొందింది.
విధ్వంసక ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వరల్డ్ కప్‌లో రికార్డు సెంచరీ బదాడు. లీగ్ దశలో అఫ్గనిస్థాన్ బౌలర్లను ఊచకోత కోసిన మ్యాక్స్‌వెల్ 40 బంతుల్లోనే శతకం సాధించాడు. ఒక దశలో ఓటమి అంచున ఉన్న ఆస్ట్రేలియాను కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో కలిసి విజయ తీరాలకు చేర్చాడు. అఫ్గన్ బౌలర్లను ఉతికారేస్తూ వీరవిహారం చేసిన అతడు 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో
ద్విశతకం నమోదు చేశాడు. తద్వారా ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్ చేసిన మూడో క్రికెటర్‌గా మ్యాక్స్‌వెల్ రికార్డు సాధించాడు. న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మార్టిన్ గఫ్టిల్(237 నాటౌట్), విండీస్ మాజీ ఆటగాడు క్రిస్ గేల్(215)లు మొదటి, రెండు స్థానాల్లో ఉన్నారు. మ్యాక్సీ వీరోచిత బ్యాటింగ్ విన్యాసాలతో సెమీస్ బెర్తు దక్కించుకున్న ఆసీస్.. ఫైనల్లో భారత్‌ను ఓడించి ఆరోసారి చాంపియన్‌గా నిలిచింది.