Stuart Broad : ఇంగ్లండ్ మాజీ స్పీడ్‌స్టర్ స్టువార్ట్ బ్రాడ్(Stuart Broad) ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్నాడు. ఏటా కొత్త ఏడాది సందర్భంగా ఇంగ్లండ్ ప్రభుత్వం ఇచ్చే సీబీఈ(కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్) అవార్డును స్వీకరించాడు. ఇంగ్లండ్ క్రికెట్‌కు ఎనలేని సేవ చేసినందుకు బ్రాడ్‌కు ఈ గౌరవం దక్కింది. మాజీ ఓపెనర్, సీనియర్ జట్టు బ్యాటింగ్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్(Marcus Threscothick) కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యాడు.
ప్రపంచంలోని మేటి బౌలర్లలో ఒకడైన బ్రాడ్ ఈ ఏడాది జూలైలో రిటైర్మెంట్ ప్రకటించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌తో బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున 167 టెస్టులు ఆడిన ఈ పేసర్ 604 వికెట్లు పడగొట్టాడు. వన్డేలతో కలిపి మొత్తంగా 800 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున రెండో అత్యధిక వికెట్ల వీరుడుగా నిలిచాడు. అంతేకాదు ఆసీస్‌పై 150 వికెట్లు తీసిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా గుర్తింపు సాధించాడు.
ఇంగ్లండ్ గొప్ప బౌలర్లలో ఒకడైన బ్రాడ్ దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2007 టీ20 ప్రపంచ కప్(T20 World Cup)ను మర్చిపోలేడు. ఆ టోర్నీలో భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) ధాటికి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు సమర్పించుకున్నాడు. యూవీ సిక్సర్ల మోతకు బలి కావడాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని, అదొక చేదు జ్ఞాపకమని బ్రాడ్ తన రిటైర్మెంట్ ప్రకటనలో చెప్పడం విశేషం.