IPL 2025 : వరల్డ్ క్లాస్ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరింత రెచ్చిపోతాడు. తొలి సీజన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)కు ఆడుతున్న విరాట్.. ఈసారి కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి పోరు ముంబై ఇండియన్స్‌పై దంచేసిన కోహ్లీ.. తన ప్రియమైన ప్రత్యర్థి చైన్నై సూపర్ కింగ్స్‌పై చెలరేగిపోయేందుకు సిద్ధమయ్యాడు. చెన్నైతో మ్యాచ్ అంటే చాలు పూనకాలు వచ్చినట్టు ఆడే అతడు.. చెపాక్‌లో ఆర్సీబీని గెలిపించేందుకు సర్వ శక్తులు ఒడ్డనున్నాడు.
ఇక సూపర్ కింగ్స్‌పై అతడి గణాంకాలు చూస్తే.. ఐపీఎల్ మొదటి ఎడిషన్ నుంచి ఇప్పటివరకూ చెన్నైతో 33 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. ఆ జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. శిఖర్ ధావన్ 1,057 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా విరాట్ 1,053 రన్స్ కొట్టాడు. అది కూడా 37.60 సగటు.. 126.26 స్ట్రయిక్ రేటుతో. సీఎస్కేపై విరాట్ అత్యధిక స్కోర్.. 90 నాటౌట్. ఈసారి ఈ స్టార్ ఆటగాడు చెపాక్‌లో సెంచరీతో గర్జించి రికార్డులు నెలకొల్పాలని బెంగళూరు అభిమానులు కోరుకుంటున్నారు.
ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీ, సీఎస్కేలు నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. అందుకే హై ఓల్టేజ్ మ్యాచ్‌గా అభివర్ణిస్తారు విశ్లేషకులు. అయితే.. ఇప్పటివరకూ చెపాక్ మైదానంలో బెంగళూరుపై ఆతిథ్య జట్టుదే ఆధిపత్యం. 2008లో మాత్రమే ఆర్సీబీ ఇక్కడ చెన్నైపై గెలుపొందింది. అంటే.. 17 ఏళ్లుగా తమ కంచుకోటలో ఎల్లో జట్టు ఆర్సీబీకి చెక్ పెడుతూ వస్తోంది. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు 33 సార్లు ఎదురుపడ్డాయి. సూపర్ కింగ్స్ 21 పర్యాయాలు గెలుపొందగా.. ఆర్సీబీ 11 విజయాలకే పరిమితమైంది.