Ram Charan | టాలీవుడ్ హీరోలపై జపాన్ అభిమానులు తెగ ప్రేమని కురిపిస్తున్నారు. మొన్నటి వరకు ప్రభాస్, ఎన్టీఆర్‌లపై ప్రేమ కురిపించిన జపనీస్ ఇప్పుడు రామ్ చరణ్‌ని ఆకాశానికి ఎత్తుతున్నారు. గ్లోబల్ స్టార్ రాంచరణ్ 40వ బర్త్ డేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎంతో అట్టహాసంగా జరుపుకున్నారు. జపాన్‌లో అయితే చరణ్ బర్త్ డేని ఓ రేంజ్లో సెలబ్రేట్ చేశారు. ఓ జపాన్ మహిళ అయితే రామ్ చరణ్‌పై ప్రత్యేక అభిమానాన్ని కనబరుస్తూ తన చీరపై తెలుగులో ‘రామ్ చరణ్’ అని రాయడమే కాకుండా, చెర్రీ ఫొటోను కూడా ముద్రించుకుంది.
అలానే ఒక ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేసి, రాంచరణ్ ఫొటోలను దానిపై ఉంచి బర్త్ డే వేడుక జరిపించారు. తన టీషర్టులపై, సంచులపై, ఇతర వస్త్రాలపై కూడా చెర్రీ ఫొటోలను ముద్రించి చరణ్‌పై తమకున్న ప్రేమని చూపించారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాని జపాన్‌లో కూడా రిలీజ్ చేయాలంటూ అక్కడి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైన జపాన్ మహిళలు చరణ్‌పై ఇంత ప్రేమని కురిపించండం మెగా ఫ్యాన్స్ ఆనందం కట్టలు తెంచుకునేలా చేస్తుంది.
ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన తాజా చిత్రం ఆర్సీ 16 ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ వదిలారు. పోస్టర్లో రామ్ చరణ్ గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో ఊరమాస్ లుక్‌లో అదరగొట్టారు.చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటించనుండగా, శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు, జగపతిబాబు వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.