Virat Kohli : పుణే టెస్టులో న్యూజిలాండ్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసిన భారత జట్టు భారీ స్కోర్‌పై కన్నేసింది. ఆఖరి సెషన్లో రోహిత్ శర్మ(0) వికెట్ పడడంతో 16 పరుగులే చేసిన టీమిండియా రెండో రోజు రఫ్ఫాడించాలనే కసితో ఉంది. అంపైర్లు ‘ఈ రోజు ఆట ముగిసింది’ అని చెప్పగానే ఇరుజట్ల ఆటగాళ్లు అందరూ డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చేశారు. కానీ, భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రం స్టేడియంలోనే ఉన్నాడు. ప్యాడ్స్ కట్టుకొని, గ్లోవ్స్ పెట్టుకొని మైదానంలోకి వచ్చేశాడు.
బెంగళూరులో సెంచరీ చేజార్చుకున్న కోహ్లీ.. ఈసారి భారీ స్కోర్ బాకీ పడ్డాడు. పైగా అతడి బ్యాట్ నుంచి 30 శతకం ఎప్పుడు జాలువారుతుందా? అని కోట్లాదిమంది అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాబ్ -4 లో వెనకబడిన విరాట్ పుణేలో వంద కొడితే అటు రికార్డుతో పాటు ఇటు జట్టుకూ లాభమే. అందుకని తొలి రోజు ఆడే చాన్స్ రాకున్నా సరే విరాట్ అలానే మైదానంలోకి వచ్చి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. నాలుగైదు షాట్లు కొడుతూ అందర్నీ అలరించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Virat Kohli Started Practicing Right After The End Of 1st Day.🏏🤍#ViratKohli #INDvsNZ #INDvNZ @imVkohli pic.twitter.com/gCt8Yupq6Y
— virat_kohli_18_club (@KohliSensation) October 24, 2024
తొలి టెస్టులో దారుణ పరాభవంతో రగిలిపోతున్న భారత జట్టు పుణే టెస్టు (Pune Test)లో పట్టుబిగిస్తోంది. స్పిన్నర్లు చెలరేగడంతో కివీస్‌ను 259 పరుగులకే ఆలౌట్ చేసింది. సిరీస్ సమం చేయాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో తొలి రోజే కివీస్‌కు కుప్పకూల్చి ఒత్తిడిలో పడేసింది. రంజీల నుంచి వచ్చిన వాషింగ్టన్ సుందర్(7/59) ఏడు వికెట్లతో కివీస్ నడ్డివిరిచాడు. రవిచంద్రన్ అశ్విన్(3/64) సైతం ఓ చేయి వేయడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు తోకముడిచారు. తొలి రోజు ఆట ముగిసే సరికి ఓపెనర్ యశస్వీ జైస్వాల్(6 నాటౌట్), శుభ్‌మన్ గిల్(10 నాటౌట్)లు అజేయంగా నిలిచారు.