Srisailam Temple | జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి హుండీ ద్వారా ఆదాయం భారీగా సమకూరింది. ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. చంద్రావతి కల్యాణ మండపంలో పటిష్టమైన భద్రత, నిఘా మధ్య ఆలయ అధికారులు సిబ్బందితోపాటు శివసేవకులు ఉభయ దేవాలయాలు, పరివార దేవాలయాల హుండీలను లెక్కించారు. గత 28 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ.2,58,56,737 ఆదాయంగా వచ్చినటు ఈవో చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. అలాగే, 379 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 8.80 కేజీల వెండి ఆభరణాలు సైతం లభించాయని పేర్కొన్నారు. వీటితో పాటు యూఎస్ఏ డాలర్లు 1093, కెనడా డాలర్లు 215, యూకే పౌండ్స్ 20, యూఏఈ ధీర్హామ్స్ 10, మలేషియా రింగేట్స్ 21, మాల్టీవ్స్ రుఫియాస్ 10, ఈరోస్ 10, సింగపూర్ డాలర్లు రెండు, మారిటియస్ 25 కరెన్సీ కరెన్సీని కానుకలుగా భక్తులు సమర్పించారని ఈవో వివరించారు.