హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చేపట్టబోయే జనగణనపై సోషల్ మీడియా వేదికగా ఎవరూ అపోహలు సృష్టించవద్దని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి కోరారు. సెన్సస్ యాక్ట్ ప్రకారం ప్రజ ల నుంచి సేకరించిన సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతామని, వ్యక్తిగత వివరాలను ఏజెన్సీలు, ఇతర సంస్థలకు ఇవ్వబోమని వెల్లడించారు. శనివారం కోఠిలోని సెన్సస్ కార్యాలయంలో ఆమె మీడియాతో పలు వివరాలు వెల్లడించారు.
ఈ ఏడాది మే 11 నుంచి జూన్ 9 వరకు తొలి విడత ఇండ్లను లెక్కిస్తామని తెలిపారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్‌ను ఏప్రి ల్ 26 నుంచి మే 10 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు సెకండ్ ఫేజ్‌లో జనగణన చేపడుతామని వెల్లడించారు. మొత్తం 88,000 మంది ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది విధుల్లో పాల్గొంటారని వెల్లడించారు.
సెన్సస్‌లో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో ఉన్న మౌలిక వసతులను లెక్కించి డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్ బుక్(డీసీహెచ్‌బీ)లో చేరుస్తామని వివరించారు. జనగణనలో భాగంగా ఇల్లు ఉంటే దాని సామర్థ్యం, ఆ ఇంటిలో ఉన్న వసతులు, వారు కలిగి ఉన్న ఆస్తులపై ఎన్యుమరేటర్లు ప్రశ్నలు అడుగుతారని చెప్పారు. కారు, బైక్‌లాంటి వంటివి ఉంటే నిర్భయంగా సమాచారం ఇవ్వొచ్చని, ప్రభుత్వ పథకాల నుంచి తొలగిస్తామనే భయం అక్కర్లేదని స్పష్టతనిచ్చారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఈసారి డిజిటల్ పద్ధతిలో జనగణన చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. కులగణన, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను కూడా చేపడతున్నట్టు వివరించారు.
సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు డైరెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. ప్రజాస్వామ్యానికి జనగణన అ త్యంత కీలకమని, 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం చేపట్టే జనగణన ప్రపంచంలోనే అతి పెద్దదిగా అభివర్ణించారు. కేంద్రానికే జనగణన చేపట్టే అధికారం ఉంటుందని, రాష్ర్టాలు చేస్తే అది కేవలం సర్వే మాత్రమే అవుతుందని స్పష్టంచేశారు. ప్రజల్లో అవగాహనతోనే సెన్సస్-2027 విజయవంతం అవుతుందని తెలిపారు. రాజ్యాంగంలోని 69వ అధికరణలోని 7వ షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపారు.
ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి మొబైల్ యాప్ ద్వారా వివరాలు సేకరిస్తారని తెలిపా రు. ఆఫ్‌లైన్‌లో సైతం ఈ యాప్ పనిచేస్తుంద ని తెలిపారు. సొంత ప్రాంతాల్లో జనగణన ద్వారా వివరాలు అందించాలని ఆమె ప్రజలను కోరారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్‌ను వెబ్ పోర్టల్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వచ్చే తరాలకు ఈ జనగణన మాస్టర్ ఫ్రేమ్‌గా ఉంటుందని చెప్పారు. తొలిసారిగా రోజూ తినే ఆహార పదార్థాల వివరాలపైనా ప్రశ్నలుంటాయని పేర్కొన్నారు.