Asia Cup 2023 : నేటితో ఆసియా కప్(Asia Cup 2023) పోటీలకు తెరలేచింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా (Team India) ఈరోజు లంక గడ్డపై అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) పైనే భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. వెస్టిండీస్ సిరీస్(West Indies Series)లో శతకాలు బాదిన ఈ ఇద్దరూ లంక గడ్డపై దుమ్మురేపాలనే కసితో ఉన్నారు. పైగా శ్రీలంక అంటేనే కోహ్లీ, రోహిత్ శివాలెత్తిపోతారు. అందుకు నిదర్శనంగా ఈ ఇద్దరికీ లంకపై మంచి రికార్డు ఉంది.
కోహ్లీ, రోహిత్ 2008 నుంచి లంక పర్యటనకు వెళ్తున్నారు. దాంతో, అక్కడి పరిస్థితులపై ఈ స్టార్ ఆటగాళ్లకు చక్కటి అవగాహన ఉంది. మరోవిషయం ఏంటంటే.. నిరుడు ఆసియా కప్‌లోనే విరాట్ ఫామ్‌లోకి వచ్చాడు. లంకతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కాడు. ఇప్పటివరకూ 28 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 899 పరుగులు సాధించాడు. అందులో నాలుగు శతకాలు ఉండడం విశేషం.
విరాట్ కోహ్లీ
సిక్సర్ల వీరుడు రోహిత్‌కు శ్రీలంకపై ఘనమైన రికార్డు ఉంది. 2017లో మొహాలీ స్టేడియంలో హిట్‌మ్యాన్ లంకపై డబుల్ సెంచరీ బాదాడు. 153 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్స్‌లతో 208 రన్స్ కొట్టాడు. శ్రీలంక పర్యటనలోనూ రోహిత్ ఇప్పటివరకూ 28 మ్యాచ్‌లు ఆడి 583 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. అయితే. బ్యాటింగ్ సగటు మాత్రం 25.34 మత్రమే.
శ్రీలంకపై డబుల్ సెంచరీ(208)కి చేరువయ్యాక రోహిత్ ఆనందహేళ
అయితే.. వన్డే వరల్డ్ ముందు కీలకమైన ఈ టోర్నీలో భారత కెప్టెన్ జోరు కొనసాగించాలని అనుకుంటున్నాడు. ఆసియా కప్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. సెప్టెంబర్ 2న జరిగే ఈ మ్యాచ్‌లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. గత ఏడాది దాయాది జట్లు రెండు సార్లు తలపడ్డాయి. చెరొక మ్యాచ్‌లో గెలిచాయి. దాంతో, ఈసారి ఫలితంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.