జెడ్డా(సౌదీ అరేబియా): క్రికెటర్ల తలరాత మారే సమయం రానే వచ్చింది. ఐపీఎల్ మెగావేలానికి మరో కొద్ది గంటల్లో తెరలేవనుంది. రానున్న సీజ న్ కోసం ప్లేయర్లను ఎంపిక చేసుకునేందుకు ఫ్రాంచైజీలు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యాయి. రెండు(ఆది, సోమ) రోజుల్లో జరిగే ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టేదెవరో తేలనుంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు కీలక ప్లేయర్లను అట్టిపెట్టుకోగా, చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తం 577 మంది ప్లేయర్లు వేలంలో పోటీపడుతున్నారు. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్‌పై అందరి కండ్లు ఉన్నాయి.
పంత్‌ను రికార్డు స్థాయిలో తమ వశం చేసుకునేందు కు ఫ్రాంచైజీలు కాచుకు కూర్చున్నాయి. గత కొన్నేండ్లుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ నుంచి బయటికి వచ్చిన పంత్ 25 కోట్లకు పైగా అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. పంత్‌కు తోడు వేలంలోకి వచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్‌సింగ్, బట్లర్, సిరాజ్, రబాడ, సాల్ట్, స్టార్క్, లివింగ్‌స్టోన్ లాంటి టీ20 స్టార్లపై ఫ్రాంచైజీలు కన్నేశాయి. అన్ని ఫ్రాంచైజీల వద్ద 641 కోట్లు ఉన్నాయి. ఇందులో అందరికంటే ఎక్కువగా పంజాబ్(110), ఆర్సీబీ(83), ఢిల్లీ(73) టాప్-3లో ఉన్నాయి.