KL Rahul : జట్టు అవసరాన్ని బట్టి ఏ స్థానంలోనైనా ఆడగల క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul). ఓపెనింగ్, ఐదో స్థానంలో.. ఇలా బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడ ఆడమన్నా ఓకే అంటూ క్రీజులో అడుగుపెడతాడీ క్లాస్ బ్యాటర్. ఆ ప్రత్యేకత అతడికి ‘ట్రబుల్ షూటర్’ అనే పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఓపెనర్‌గా జట్టుకు శుభారంభాలు ఇస్తున్న రాహుల్.. తన నెలల బిడ్డను ఎంతో మిస్ అవుతున్నాడు. ఈ ఏడాది మార్చిలో తండ్రైన అతడు.. కూతురును ముద్దు చేయాల్సింది పోయి దేశం కోసం ఆడాల్సిందే అంటూ స్క్వాడ్ కంటే ముందుగానే ఇంగ్లండ్ విమానం ఎక్కాడు.
బాలీవుడ్ నటి అథియా శెట్టిని పెళ్లి చేసుకున్న రాహుల్ మార్చిలో తండ్రిగా ప్రమోట్ అయ్యాడు. అథియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమ గారాలపట్టికి ‘దేవుడిచ్చిన బహుమతి’ అనే అర్ధం వచ్చేలా ‘ఇవారహ్ విపుల్ రాహుల్’ అని నామకరణం చేసిందీ జంట. దాంతో, ఐపీఎల్ ముగియగానే కూతురితోతో గడిపాలనుకున్నాడు రాహుల్. కానీ, రోహిత్, కోహ్లీల వీడ్కోలుతో ఇంగ్లండ్ పర్యటనకు రాహుల్ లాంటి మ్యాచ్ విన్నర్ అవసరం ఏర్పడింది. దాంతో.. ఇంగ్లండ్ పర్యటనకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లాలనుకున్నాడీ సొగసరి బ్యాటర్. అయితే.. ఈ టూర్‌కు ముందు రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) హెడ్ కోచ్ హేమంగ్ బదాని(Hemang Badani)తో మాట్లాడాడు.
‘ఈమధ్యే తండ్రివి అయ్యావు. కూతురితో ఆడుకోవాలని లేదా? అని బదాని రాహుల్‌ను అడిగాడు. అందుకు అతడు ‘లేదు హేమంగ్ భాయ్. నాకు కుటుంబం కంటే దేశమే ముఖ్యం. ప్రస్తుతం ఈ జట్టుకు నా సేవలు ఎంతో అవసరం. అందుకే.. నేను ముందుగానే ఇంగ్లండ్ వెళ్లాలని అనుకుంటున్నా. తొలి టెస్టుకు ముందే అనధికారిక టెస్టులు ఆడాలని ఉంది’ అని చెప్పాడు. అతడి మాటలు విని షాకయ్యాను. కానీ, రాహుల్ చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం అని బదాని వెల్లడించాడు.
మామూలుగా అయితే.. అతడు స్క్వాడ్‌తో కలిసి తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్ వెళ్లితే సరిపోయేది. కానీ, తనపై ఆధారపడిన జట్టును ఆదుకోవాలంటే గొప్పగా రాణించాలని రాహుల్ అనుకున్నాడు. అందుకే ముందుగా వెళ్లి.. అక్కడి వాతావరణానికి అలవాటు పడాలని భావించాడు. అందుకని రెండు నెలల వయసున్న తన వారసుడిని కూడా మిస్ అయ్యేందుకు సిద్ధమయ్యాడీ. ఫ్యామిలీ కంటే దేశమే ముఖ్యమనుకునే రాహుల్ లాంటి క్రికెటర్‌ను తాను చూడలేదని అంటున్నాడు ఢిల్లీ కోచ్ బదాని.
రోహిత్ శర్మ రిటైర్మెంట్తో ఖాళీ అయిన ఓపెనింగ్ స్థానాన్ని భర్తీ చేసిన రాహుల్ ఇంగ్లండ్ గడ్డపై సత్తా చాటుతున్నాడు. అనుభవజ్ఞుడైన అతడు జట్టును రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆతిథ్య జట్టు బౌలర్లును ఉతికేసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపి.. కుర్రాళ్లు చెలరేగి ఆడేందుకు బాటలు వేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్‌తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన రాహుల్ టీమిండియాను పోటీలోకి తెచ్చాడు. అయితే.. టెయిలెండర్ల వైఫల్యంతో 31 పరుగులకే చివరి ఆరు వికెట్లు కోల్పోయింది గిల్ సేన. అనంతరం 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఆడుతూపాడుతూ ఛేదించింది.
KL Rahul and Athiya Shetty have become parents to a baby girl. Congratulations!@theathiyashetty@klrahul pic.twitter.com/1EN8tbNKUW
— t2 (@t2telegraph) March 24, 2025