అంబర్పేట, జూన్ 27 : బాగ్ అంబర్పేట డివిజన్ పరిధిలోని మోహిని చెరువు హిందూ శ్మశాన వాటికను డివిజన్ కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులను పరిశీలించారు. స్మశాన వాటికలో రూ. 2.75 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని స్వయంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో అస్తికలు దాచేందుకు ఒక రూము, కాంపౌండ్ వాల్ పై షీట్లు, టాయిలెట్స్ ల నిర్మాణం, స్మశాన వాటికకు వచ్చిన వారు కూర్చునేందుకు బల్లలు తదితర పనులను చేస్తున్నారు. వీటిని పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులను పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అంత్యక్రియలకోసం వచ్చే ప్రజలకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు తప్పకుండా అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ ప్రశాంతి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.