బొల్లారం, జూన్ 27 : కంటోన్మెంట్, బొల్లారంలోని ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల నూతన భవనాలను గ్లాండ్ ఫార్మా సంస్థ సహకారంతో సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల, కళాశాల భవనాలను శుక్రవారం గ్లాండ్ ఫార్మా మేనేజింగ్ ట్రస్టీ రఘు రామన్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీ, ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. సిఎస్ఆర్ నిధుల కింద ల్యాండ్ ఫార్మా సంస్థ చేసిన సహకారం గొప్పదని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు రాజకీయాలలో, వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు. మట్టిలో మాణిక్యాల లాంటి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల కళాశాలలోనే తయారవుతారని, కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతున్నట్లు, విద్యార్థులు కూడా ప్రయోజకులు అవుతున్నారని వెల్లడించారు.
అనంతరం సంస్ధ ట్రస్టీ రఘు రామన్ మాట్లాడుతూ.. నూతన పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల వసతులు, అధునాతన సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు వారికి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పదవ తరగతి, ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం చేసి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీ, డీఈఓ కిషన్, ఇంటర్మీడియట్ బోర్డు ఎడ్యుకేషన్ డిప్యూటీ సెక్రెటరీ యాదగిరి, ఉపాధ్యాయులు ఫెడ్రిక్, సంస్థ ప్రతినిధులు, సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, జయ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.