KL Rahul – Athiya : ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ (KL Rahul) గుడ్‌న్యూస్ చెప్పాడు. తాను, అథియా శెట్టి (Athiya Shetty) త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామని రాహుల్ వెల్లడించాడు. తమ జీవితంలోని సంతోషకరమైన విషయాన్ని రాహుల్, అథియాలు శుక్రవారం అభిమానులతో పంచుకున్నారు.
రాహుల్, అథియాలకు పెండ్లి అయి ఏడాది దాటుతోంది. దాంతో, ఈ జంట శుభవార్త ఎప్పుడు చెబుతుందబ్బా? కుటుంబసభ్యులతో పాటు అభిమానులు ఎదురు చూశారు. వాళ్ల నిరీక్షణ ఫలిస్తూ.. ఆ రోజు రానే వచ్చింది. శుక్రవారం అథియా ఇన్స్టాగ్రామ్ వేదికగా తాను గర్భం దాల్చిన విషయాన్ని వెల్లడించింది.
‘అందమైన ఆశీర్వాదం త్వరలోనే రాబోతోంది’ అని ఇంగ్లీష్‌లో రాసుకొచ్చారు. దాంతో, అమ్మానాన్నలు కాబోతున్న రాహుల్, అథియాలకు క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో అథియా తొలి బిడ్డకు జన్మనివ్వనుంది.
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ అయిన రాహుల్, బాలీవుడ్ హీరో సునీల్ శెట్టీ కూతురు అయిన అథియాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు డేటింగ్ చేసిన ఈ ఇద్దరూ ఎట్టకేలకు 2023 జనవరి 23న దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. ఖండాల కొండ ప్రాంతంలోని సునీల్ శెట్టి ఫామ్ హౌస్‌లో వీళ్ల వివాహ వేడుక అంబరాన్నంటేలా జరిగింది. ఇక.. ఐపీఎల్ 16వ సీజన్లో మోకాలి నొప్పి కారణంగా టోర్నీకి దూరమైన రాహుల్ సర్జరీ అనంతరం జట్టులోకి వచ్చాడు.
ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌లో చెలరేగి ఆడిన రాహుల్ స్వదేశంలో న్యూజిలాండ్‌పై విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లో పేలవ ఆటతో నిరాశపరిచాడు. అయినా సరే సెలెక్టర్లు అతడికి అవకాశమిస్తూ బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేశారు. అయితే.. ఆస్ట్రేలియా ఏ జట్టుతో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు పరుగులు చేసిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగులకే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దాంతో, కెప్టెన్ రోహిత్ శర్మ బదులు పెర్త్ టెస్టులో రాహుల్‌ను ఓపెనర్‌గా పంపే విషయమై సందేహాలు నెలకొన్నాయి.