ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఆతిథ్యమిస్తున్న మొదటి ఖోఖో ప్రపంచకప్ పోటీలు సోమవారం అట్టహాసంగా మొదలయ్యాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ కాగడాను వెలిగించి ఈ పోటీలను అధికారికంగా ప్రారంభించారు. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య భారత్.. ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో ఐదు పాయింట్ల తేడాతో నేపాల్‌ను ఓడించి బోణీ కొట్టింది. మ్యాచ్‌లో భారత్ 42 పాయింట్లు సాధించగా నేపాల్ 37 పాయింట్లకే పరిమితమైంది.
ఆసాంతం ప్రేక్షకులను మునివేళ్లపై కూర్చోబెట్టిన పోరులో భారత్ మధ్యలో తడబడ్డా తర్వాత పుంజుకుని తొలి విజయాన్ని నమోదుచేసింది. నాలుగు టర్న్‌లు (ఒక్కో టర్న్ ఏడు నిమిషాలు) గా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట అటాకింగ్‌ను ఎంచుకున్న భారత్.. మొదటి టర్న్‌లో నేపాల్ నాలుగు బ్యాచ్(ఒక్కో బ్యాచ్‌లో ముగ్గురు)లను ఆలౌట్ చేసి 24 పాయింట్లు రాబట్టింది. అనంతరం నేపాల్.. అటాకింగ్‌లో 18 పాయింట్లే సాధించింది. రెండో టర్న్‌లో నేపాల్ కాస్త పుంజుకుని తమను తాము అద్భుతంగా డిఫెండ్ చేసుకుంది. దీంతో భారత్ 18 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది. కీలకమైన నాలుగో టర్న్‌లో నేపాల్.. 21 పాయింట్లు సాధించాల్సి ఉండగా నేపాలీలు 17 పాయింట్లే దక్కించుకోవడంతో భారత్ విజయఢంకా మోగించింది.
ఈ పోటీల ఆరంభానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు అభిమానులను అలరించాయి. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ వేడుకలలో భారతీయత ఉట్టిపడేలా కళాకారులు ప్రదర్శనలిచ్చారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ, ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా.. అంతర్జాతీయ, భారత ఖోఖో సమాఖ్య అధ్యక్షుడు సుదాన్షు మిట్టల్‌తో పాటు పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.