లేహ్(లడఖ్): జమ్ము కశ్మీర్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో తెలంగాణ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. శనివారం జరిగిన పురుషుల 500 మీటర్ల ఐస్ స్కేటింగ్‌లో తెలంగాణ యువ స్కేటర్ సూరపనేని ప్రణవ్ మాధవ్ పసిడి పతకంతో మెరిశాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ప్రణవ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
రేసును 56.86సెకన్లలో ముగించిన ప్రణవ్ అగ్రస్థానంలో నిలువగా, సమ్రుద్(1:00:31సె, కర్నాటక), సుమిత్ తప్కిర్(1:00:58సె, మహారాష్ట్ర) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. టోర్నీలో ప్రస్తుతం రెండు స్వర్ణాలు దక్కించుకున్న తెలంగాణ టాప్‌లో కొనసాగుతున్నది. మరోవైపు పురుషుల ఐస్ హాకీలో ఉత్తరాఖండ్ 6-0తో హిమాచల్‌ప్రదేశ్‌పై విజయాలు సాధించాయి.