IND A vs England Lions : ఐపీఎల్లో అదరగొట్టిన ఖలీల్ అహ్మద్(4-55) ఇంగ్లండ్ గడ్డపై కూడా నిప్పులు చెరుగుతున్నాడు. రెండో అనధికారిక టెస్టులో ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇంగ్లండ్ లయన్స్(England Lions)ను గట్టి దెబ్బ కొట్టాడు. నలుగురు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లను పెవిలియన్ పంపి ఆ జట్టను ఆలౌట్ అంచున నిలిపాడు. దాంతో, ఆతిథ్య జట్టు లంచ్ సమయానికి 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.
మొదటి అనధికారిక టెస్టు మాదిరిగానే రెండో మ్యాచ్ కూడా డ్రా దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్(116) విధ్వంసక సెంచరీతో 348 రన్స్ కొట్టిన భారత ఏ జట్టు.. అనంతరం ఇంగ్లండ్ లయన్స్‌ను కట్టడి చేయడంలో విఫలమైంది. బౌలర్ల వైఫల్యంతో ఇంగ్లండ్ కుర్రాళ్లు క్రీజులో పాతుకుపోయారు. అయితే.. రెండోరోజు తేలిపోయిన భారత బౌలర్లు మూడోరోజు మాత్రం విజృంభించారు. ఓవర్‌నైట్ స్కోర్ 192-3తో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను ఖలీల్ అహ్మద్(4-55) కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
Four wickets for Khaleel Ahmed and India ‘A’ have made a strong start to Day 3 of the unofficial Test in Northampton pic.twitter.com/iOaUgDNgvF
— Cricbuzz (@cricbuzz) June 8, 2025
బంతిని స్వింగ్ చేసిన ఖలీల్ తొలి సెషన్లోనే వికెట్ల వేట కొనసాగించాడు. అతడి పేస్‌కు లయన్స్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. జోర్డాన్ కాక్స్(45)ను ఔట్ చేసిన అతడు ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పిన కాక్స్ వికెట్‌తో ఇంగ్లండ్ పతనం మొదలైంది. ఆ తర్వాత జేమ్స్ రెవ్(10), జార్జ్ హిల్(0), క్రిస్ వోక్స్(5)ను పెవిలియన్ పంపిన ఖలీల్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. దాంతో, ఇంగ్లడ్ లంచ్ టైమ్‌కు 8 వికెట్లు కోల్పోయి 266 రన్స్ చేసింది. ప్రస్తుతం ఫర్హాన్ అహ్మద్(19), జోష్ టంగ్ (14)లు క్రీజులో ఉన్నారు.