Beatrice Chebet : ట్రాక్ మీద తన ఆధిపత్యాన్ని చాటిన కెన్యా అథ్లెట్ బియట్రిక్ చెబెట్ (Beatrice Chebet) చరిత్ర సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్(Paris Olympics)లో స్వర్ణ పతకాలతో మెరిసిన ఆమె ఈసారి 5 వేల మీటర్ల పరుగును కేవలం 13 నిమిషాల్లోనే పూర్తి చేసి వరల్డ్ రికార్డు నెలకొల్పింది. అమెరికాలోని యుగెనేలో శనివారం జరిగిన ప్రొఫెంటెన్ క్లాసిక్(Prefontaine Classic)లో చెబెట్ చిరుతలా దౌడు తీసింది.
ప్రత్యర్థులను ఆశ్చర్యానికి గురి చేస్తూ గమ్యస్థానం వైపు దూసుకెళ్లిన ఆమె 13 నిమిషాల 58.06 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. సంచలన వేగంతో పరుగు తీసిన చెబెట్ ఇథియోపియా రన్నర్ గుడాఫ్ సెగే పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. రెండేళ్ల క్రితం ఇదే వేదికపై గుడాఫ్ 14:00.21 టైమింగ్‌తో 5 వేల మీటర్ల పరుగును పూర్తి చేసింది.
Watch Beatrice Chebet 🇰🇪 set a new 5000m world record of 13:58.06 at the Prefontaine Classic 2025👇🏾 pic.twitter.com/GEdzvmocad
— Kenya One Sports 🇰🇪 (@TonnyKe11) July 5, 2025
పారిస్ ఒలింపిక్స్‌లో చెబెట్ దేశానికి రెండు గోల్డ్ మెడల్స్ అందించింది. 5 వేల,10 వేల మీటర్ల పరుగులో పసిడి పతకంతో కెన్యా గర్వపడేలా చేసింది. గత నెలలో రోమ్‌లో 5 వేల మీటర్ల రన్లో పాల్గొన్న ఆమె 14:06.39 టైమింగ్‌తో రేసును ముగించింది. ఈసారి ప్రెఫొంటెన్ క్లాసిక్‌లో తన ప్రదర్శనను మెరుగుపర్చుకున్న చెబెట్ రికార్డులు బద్ధలు కొడుతూ విజేతగా నిలిచింది.