Kapil Dev : భారత జట్టుకు మొట్ట మొదటి వరల్డ్ కప్(ODI World Cup 1983) అందించిన కపిల్ దేవ్(Kapil Dev ) కొత్త చరిత్ర సృష్టించాడు. దాంతో, అప్పటివరకూ అనామక జట్టుగా ముద్రపడిన టీమిండియా పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. టీమిండియా గొప్ప కెప్టెన్లలో ఒకడైన కపిల్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడు కిడ్నాప్ అయిన వీడియోను మాజీ క్రికెటర్ గౌతం గంభీర్(Gautam Gambhir) తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
‘మరెవరికైనా ఈ వీడియో వచ్చిందా. అందులోని వ్యక్తి నిజమైన కపిల్ దేవ్ కాడని నమ్ముతున్నా. కపిల్ పాజీ క్షేమంగా ఉన్నాడని అనుకుంటున్నా’ అని గౌతీ క్యాప్షన్ రాశాడు. ఇంతకు అందులో ఏం ఉందంటే.. ? కపిల్ దేవ్‌ను ఇద్దరు వ్యక్తులు బలవంతంగా లాక్కెళ్తున్నారు. అంతేకాదు ఈ లెజెండరీ క్రికెటర్ చేతులను వెనక్కి కట్టేయడమే కాకుండా నోట్లో కర్చీఫ్ కుక్కారు.
Anyone else received this clip, too? Hope it’s not actually @therealkapildev 🤞and that Kapil Paaji is fine! pic.twitter.com/KsIV33Dbmp
— Gautam Gambhir (@GautamGambhir) September 25, 2023
కొంతదూరం వెళ్లాక కపిల్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ మొదట ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఈ కిడ్నాప్ డ్రామా అంతా ఒక ప్రకటన కోసం అని తెలిసి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ప్రమోషన్ కోసం ఇలాంటి వీడియోలు చేయడమేంటి? అని చాలామంది తీవ్ర విమర్శలు గుప్పించారు.
కపిల్ దేవ్ రెండు రోజుల క్రితం వారణాసిలో కనిపించాడు. ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రవి శాస్త్రితో కలిసి అతి పెద్ద స్టేడియం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాడు. 1983లో వరల్డ్ కప్‌లో కపిల్ అద్భుతంగా రాణించాడు. సెమీఫైనల్లో జింబాబ్వేపై 175 పరుగులతో చెలరేగాడు. దాంతో, ఇండియా తొలిసారి ఫైనల్ చేరింది. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి చాంపియన్‌గా అవతరించింది.