మోరి: కోనసీమలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా మలికిపురం మండలం ఇరుసమండలోని మోరి-5 డ్రిల్లింగ్ సైటులో సోమవారం భారీ స్థాయిలో అగ్నిజ్వాలలు ఎగిసిపడిన విషయం తెలిసిందే. ఆ అగ్నికీలలు సుమారు 25 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మంటల్ని ఆర్పేందుకు ఓఎన్జీసీ నిపుణుల బృందం(ONGC Experts) ముంబై, ఢిల్లీ నుంచి వస్తున్నట్లు అధికారి తెలిపారు. అయితే సోమవారంతో పోలిస్తే ఇవాళ కాస్త అగ్నిమంటల తీవ్రత తగ్గినట్లు తెలుస్తున్నది.
మహారత్న కంపెనీ దీన్ని ఆపరేట్ చేయడం లేదు. అహ్మదాబాద్‌కు చెందిన డీప్ ఇండస్ట్రీస్ కంపెనీ ఈ వెల్‌ను ఆపరేట్ చేస్తున్నది. ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు అగ్నిమాపక సిబ్బంది నీటి గొడుగును తయారు చేసింది. కానీ ఇంకా కొంత వరకు జ్వాలలు వస్తూనే ఉన్నాయి. అయితే నిపుణుల బృందం వచ్చిన తర్వాత పరిస్థితిని అంచనా వేస్తారని, ఆ తర్వాత మంటల్ని ఆర్పే ప్రక్రియ చేపడుతారని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాంతి తెలిపారు.
ముంబై, ఢిల్లీ నుంచి నిపుణుల బృందం వస్తున్నట్లు చెప్పారు. అగ్నిజ్వాలలు ఎగిసిపడిన ప్రదేశం సమీపంలో ఉన్న సుమారు 600 మంది గ్రామస్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. డీప్ ఇండస్ట్రీస్ సంస్థ మోరి-5 వెల్‌ను గత ఏడాది నుంచి ఆపరేట్ చేస్తున్నది.