Tollywood | సంక్రాంతి సీజన్ వచ్చిందంటే టాలీవుడ్లో పోటీ మామూలుగా ఉండదు. ఈసారి ఆ పోటీ మరింత హాట్‌గా మారింది. మార్కెట్ ఉన్న స్టార్ హీరోలతో పాటు పరభాషా హీరోలు కూడా రంగంలోకి దిగుతుండటంతో థియేటర్లు సందడితో నిండబోతున్నాయి. జనవరి 9 నుంచి 14 మధ్య ఐదు భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా, వాటి ప్రమోషన్లు కూడా అదే స్థాయిలో జోరుగా సాగుతున్నాయి. విజయ్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోల సినిమాలు పక్క భాషల్లో విడుదలవుతుండగా, తెలుగులో ‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ట్రైలర్లు, సాంగ్స్, గ్రాండ్ ఈవెంట్స్‌తో మేకర్స్ గట్టి ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలో జనవరి 7వ తేదీ టాలీవుడ్ క్యాలెండర్లో ప్రత్యేక రోజుగా మారింది. ఒకే రోజున నాలుగు పెద్ద ఈవెంట్లు జరగనున్నాయి. ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రమోషన్లలో భాగంగా రెండు ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్, ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్, మరో ప్రమోషనల్ ఈవెంట్ ఒకే రోజున ప్లాన్ చేయడం ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి జనవరి 7న హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీనికి ‘మెగా విక్టరీ ప్రీ రిలీజ్ ఈవెంట్’ అనే టైటిల్ పెట్టారు. వేదిక వివరాలు ఇంకా వెల్లడించకపోయినా, ఈ కార్యక్రమంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే రోజు సాయంత్రం 4.05 గంటలకు రవితేజ హీరోగా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.
అలాగే జనవరి 7 సాయంత్రం 6.04 గంటలకు నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ విడుదల కార్యక్రమం ప్లాన్ చేశారు. అంతేకాదు, ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి కూడా అదే రోజు మరో ప్రమోషనల్ ఈవెంట్ ఉండొచ్చన్న ప్రచారం వినిపిస్తోంది. ఇలా ఒకే రోజున, అది కూడా కేవలం రెండు గంటల వ్యవధిలో రెండు ట్రైలర్ లాంచ్‌లు జరగడం, దానికి తోడు మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండటం ఇండస్ట్రీలో చర్చకు దారి తీస్తోంది. సంక్రాంతి బాక్సాఫీస్ పోటీలో ఎవరి వ్యూహం ఫలిస్తుందో, ఏ సినిమా జనాలను ఎక్కువగా ఆకట్టుకుంటుందో చూడాలి. జనవరి 7 తర్వాత టాలీవుడ్ హీట్ మరింత పెరగడం ఖాయమనే మాట వినిపిస్తోంది.