Lakshma Reddy | యాసంగిలో జూరాల ప్రాజెక్టు కింద ఆయకట్టుకు క్రాప్ హాలీ డే ఇచ్చారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గుర్తుచేశారు. క్రాప్ హాలీడే ఇచ్చిన ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోస్తారా అని ప్రశ్నించారు. జూరాల నుంచి నీళ్లు ఎత్తిపోయడం అసాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు మళ్లీ తొండి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు అజ్ఞానంతో మాట్లాడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీటిని ఎలా ఎత్తిపోస్తారని ప్రశ్నించారు.
పాలమూరులో పడావు పడ్డ ప్రాజెక్టులపై గులాబీ పార్టీ సమరభేరీ మోగించింది. ఈ క్రమంలో జూరాల ప్రాజెక్టును మాజీ మంత్రులు నింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్లతో కూడిన బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సందర్శించింది. నార్లపూర్ పంప్‌హౌజ్, రిజర్వాయర్, వట్టెం పంప్‌హౌజ్, కరివెన రిజర్వాయర్లను సందర్శించారు. ప్రాజెక్టులను పడావు పెట్టిన ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అట్టర్ ఫ్లాప్ అవుతుందని విమర్శించారు. కొడంగల్ లిఫ్ట్‌తో ప్రజాధనం కచ్చితంగా వృథా అవుతుందని అన్నారు. కేసీఆర్ గొప్పగా ప్రాజెక్టు డిజైన్ చేస్తే.. దాన్ని పడావు పెట్టారని మండిపడ్డారు. కాల్వలకు టెండర్లు పిలిచి పూర్తి చేస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు నీళ్లు వస్తాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవగాహన లేకుంటే నిపుణులతో మాట్లాడి తెలుసుకోవాలని సూచించారు.
మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి కమీషన్లు దండుకున్న ఘనత కాంగ్రెస్ పాలకులదే అని లక్ష్మారెడ్డి విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆరు నెలల్లోనే పాలమూరు ప్రాజెక్టు పూర్తయ్యేదని అన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నారని లక్ష్మారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుకు చెప్పి రాయలసీమ ప్రాజెక్టును ఆపించానని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అంటే.. ఆ వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించిందని తెలిపారు. జూరాల నుంచి పాలమూరు లిఫ్ట్ పెడితే ఒక్క చుక్క నీరు కూడా రాదని పేర్కొన్నారు. ఎన్ని రోజులు పంపింగ్ చేసినా లాభం ఉండదని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాను ఎడారిగా మార్చే ఆలోచనలు చేస్తున్నారని అన్నారు. దీనిపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడలేదని ప్రశ్నించారు.