హాంగ్జౌ: చైనాలోని హాంగ్జౌ వేదికగా ప్రస్తుతం 19వ ఎడిషన్ ఆసియా క్రీడలు జరుగుతున్నాయి. ఈ క్రీడలు 2023వ సంవత్సరంలో జరుగుతున్నప్పటికీ అధికారికంగా మాత్రం ‘ఏషియన్ గేమ్స్ 2022’ అనే ప్రస్తావిస్తున్నారు. ఆటలు జరిగే ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన బోర్డులపైన, గెలిచిన క్రీడాకారులకు అందజేసే పతకాలపైన ‘ఏషియన్ గేమ్స్ 2022’ అనే ప్రచురిస్తున్నారు. అయితే ఈ గేమ్స్ 2023లో జరుగుతుంటే 2022 అని ఎందుకు ప్రస్తావిస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఎందుకలా ప్రస్తావిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఏషియన్ గేమ్స్‌ను ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. అందులో భాగంగా 19వ ఎడిషన్ 2022లో, 20వ ఎడిషన్ 2026లో జరుగాల్సి ఉంది. కానీ, చైనా జీరో కొవిడ్ పాలసీ కారణంగా 2022లో ఆసియా క్రీడలు నిర్వహించడం సాధ్యం కాలేదు. దాంతో 2023కు వాయిదా పడ్డాయి.
2022లో జరుగాల్సిన క్రీడలే 2023లో జరుగుతున్నందున ఈ క్రీడలను అన్ని చోట్లా అధికారికంగా 2022 ఆసియా క్రీడలుగానే ప్రస్తావిస్తున్నారు. 2022 క్రీడలను 2023లో నిర్వహిస్తున్నప్పటికీ ఏ ఆటంకం లేకపోతే 20వ ఎడిషన్ ఆసియా క్రీడలు 2026లోనే జరుగనున్నాయి.