కోల్‌కతా : దక్షిణాఫ్రికాతో కోల్‌కతా వేదికగా శుక్రవారం నుంచి మొదలుకాబోయే తొలి టెస్టు కోసం భారత జట్టు ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లతో బరిలోకి దిగనుంది. రెగ్యులర్ కీపర్ రిషభ్ పంత్‌కు తోడుగా ధృవ్ జురెల్నూ తుది జట్టులో ఆడించేందుకు టీమ్ మేనేజ్మెంట్ సిద్ధమైంది. ఆల్‌రౌండర్‌గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్న నితీశ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. టెస్టు సిరీస్ నుంచి అతడిని విడుదల చేసిన మేనేజ్మెంట్.. రాజ్‌కోట్‌లో భారత ‘ఏ’ జట్టుతో కలవాలని ఆదేశించింది. దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరుగబోయే అనధికారిక వన్డే సిరీస్‌లో నితీశ్ ఆడనున్నాడు.
ఇంగ్లండ్‌తో సిరీస్‌లో గాయపడి స్వల్ప విరామం తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన పంత్‌తో పాటు ఫైనల్ లెవన్‌లో జురెల్ కూడా ఉంటాడని అసిస్టెంట్ కోచ్ రియాన్ డస్కటె స్పష్టం చేశాడు. డస్కటె మాట్లాడుతూ.. ‘జట్టు కూర్పు విషయంలో మేం స్పష్టతతో ఉన్నాం. ఆ ఇద్దరినీ (పంత్, జురెల్)ను పక్కనబెట్టే పరిస్థితి లేదు. గత ఆరు నెలలుగా జురెల్ నిలకడగా రాణిస్తున్నాడు. బెంగళూరులో గతవారం రెండు శతకాలు (దక్షిణాఫ్రికాతో జరిగిన అనధికారిక టెస్టుల్లో) చేశాడు’ అని చెప్పాడు. తుదిజట్టులో 11 మందికే చోటున్న నేపథ్యంలో ఈ ఇద్దరినీ ఆడిస్తే ఆల్‌రౌండర్ నితీశ్‌ను పక్కనబెట్టక తప్పదని డస్కటె తెలిపాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న జురెల్.. వెస్టిండీస్‌తో జరిగిన అహ్మదాబాద్ టెస్టులోనూ శతకంతో సత్తాచాటాడు. జురెల్ రాకతో భారత మిడిలార్డర్ మరింత బలోపేతం కానున్నది.
కోల్‌కతాలో కుల్దీప్ యాదవ్‌కు బదులు అక్షర్ పటేల్‌ను ఆడించే అవకాశమున్నట్టు డస్కటె హింట్ ఇచ్చాడు. ‘మా జట్టులో ముగ్గురు స్పిన్ ఆల్‌రౌండర్లున్నారు. అక్షర్, వాషింగ్టన్, జడేజా రూపంలో మా లోయరార్డర్ పటిష్టంగా ఉంది. దక్షిణాఫ్రికా స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ఇది మాకు ఎంతో కలిసొస్తుంది’ అని చెప్పడం గమనార్హం.
నిరుడు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న టీమ్ఇండియా.. ఆ ఓటముల నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్నామని డస్కెట్ తెలిపాడు. ‘కివీస్ సిరీస్ నుంచి మేం చాలా నేర్చుకున్నాం. స్పిన్‌ను ఆడేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచించాం. ఈ రెండు టెస్టులూ చాలా కీలకం. మరీ ముఖ్యంగా దక్షిణాఫ్రికా నలుగురు స్పిన్నర్లతో ఈ పర్యటనకు వచ్చింది. వాళ్లు పాకిస్థాన్‌తో సిరీస్‌లో ముగ్గురు స్పిన్నర్లను ఆడించి మంచి ఫలితాలు రాబట్టారు. ఇక్కడా అదే విధానాన్ని కొనసాగించే అవకాశాలున్నాయి. వారిని ఎదుర్కొనేందుకు మేం కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాం’ అని చెప్పాడు. కివీస్ స్పిన్నర్లు భారత బ్యాటింగ్ లైనప్‌ను కకావికలు చేసి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన విషయం విదితమే. మరోవైపు పాకిస్థాన్‌తో టెస్టుల్లో సఫారీ స్పిన్నర్లు హార్మర్ (13 వికెట్లు), ముత్తుస్వామి (11), మహారాజ్ (9) రాణించారు. స్పిన్‌కు అనుకూలించే ఉపఖండపు పిచ్‌లపై ఈ త్రయంపైనే మరోసారి సఫారీ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది.