IND vs ENG | లండన్: ఒక్క టెస్ట్‌తోనే ఇంగ్లండ్ టీమ్ గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. టీమిండియాను మాటలతో కవ్విస్తే ఏం జరుగుతుందో వాళ్లకు లార్డ్స్ టెస్ట్‌తో స్పష్టంగా తెలిసిపోయింది. ఆ మ్యాచ్‌లో అనూహ్యంగా 151 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లండ్.. ఇప్పుడు తన పొరపాట్లపై దృష్టి సారించింది. ముఖ్యంగా ఇక తమ ఆటగాళ్లు నోటికి పని చెప్పబోరని ఆ టీమ్ కెప్టెన్ జో రూట్ చెప్పాడు. బుధవారం నుంచి మూడో టెస్ట్ ( India vs England ) ప్రారంభం కానున్న నేపథ్యంలో రూట్ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. టీమిండియా ఎలాగైనా ఆడనీ.. మేము మాత్రం మా ఉత్తమమైన ఆటతీరు కనబరచడానికి ప్రయత్నిస్తాం. నోటికి పని చెప్పే కంటే మా టీమ్ ఆటపై దృష్టి పెడుతుంది. ఆట నుంచి దృష్టి మరల్చే దేనినీ పట్టించుకోవాలనుకోవడం లేదు అని రూట్ అన్నాడు.
తమ టీమ్ కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు చేసిందని రూట్ అంగీకరించాడు. కెప్టెన్‌గా తాను కూడా కాస్త భిన్నంగా చేయాల్సిందని అతడు అభిప్రాయపడ్డాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడిన ఇంగ్లండ్‌ను గాయాలు కూడా వేధిస్తున్నాయి. తాజాగా స్టార్ బౌలర్ మార్క్ వుడ్ కూడా గాయం బారిన పడి మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు. దీంతో హెడింగ్లీలో జరగబోయే ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ కొన్ని కీలకమైన మార్పులు చేయనుంది. ఇప్పటికే ఓపెనర్ డొమినిక్ సిబ్లీపై వేటు వేసింది. అతని స్థానంలో హసీబ్ హమీద్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.