ఇంగ్లాండ్ మాజీ సారథి జో రూట్ కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్. ఆదివారం లార్డ్స్ వేదికగా ముగిసిన ఇంగ్లాండ్-న్యూజిలాండ్ టెస్టులో 10 వేల పరుగుల మార్కును అందుకున్న రూట్.. టెస్టులలో అత్యధిక పరుగులు సాధించిన సచిన్ రికార్డులు బ్రేక్ చేయడం పెద్ద విషయమేమీ కాదని అంటున్నాడు.
రూట్ పదివేల మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో టేలర్ మాట్లాడుతూ.. ‘రూట్ వయస్సు ఇప్పుడు 31 ఏండ్లు. తక్కువలో తక్కువ అతడు మరో ఐదేండ్లు క్రికెట్ ఆడతాడు. కావున టెండూల్కర్ టెస్టులలో అత్యధిక పరుగుల రికార్డును అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. గత రెండేండ్లుగా.. మరీ ముఖ్యంగా గడిచిన 18 నెలలుగా రూట్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు..
ఒకవేళ రూట్ ఇదే ఫామ్ కొనసాగిస్తూ గాయాల భారీన పడకుండా ఉంటే అతడు మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బద్దలుకొట్టడం పెద్ద విషయమేమీ కాదని నా అభిప్రాయం..’ అని తెలిపాడు. టెస్టులలో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు సచిన్ పేరిట ఉంది. టెండూల్కర్ తన కెరీర్ లో 200 టెస్టులాడి 15,921 పరుగులు చేశాడు. రూట్ ప్రస్తుతం 118 టెస్టులలో 10,015 పరుగులు సాధించాడు. సచిన్ రికార్దును అధిగమించాలంటే రూట్.. 5,906 పరుగులు చేయాల్సి ఉంది.
కాగా లార్డ్స్ లో ముగిసిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో అజేయ సెంచరీ (115 నాటౌట్) తో కదం తొకకాడు రూట్. టెస్టులలో అతడికి 26వ శతకం. లార్డ్స్ టెస్ట్ లో సెంచరీ చేయడం ద్వారా రూట్.. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ చరిత్రలో 10 వేల పరుగులు పూర్తిచేసిన 14వ క్రికెటర్ అయ్యాడు. ఇంగ్లాండ్ తరఫున 10వేల పరుగులు చేసిన రెండో క్రికెటర్. ఈ జాబితాలో అలెస్టర్ కుక్ (12,472) అగ్రస్థానంలో నిలిచాడు.