కొలంబో : మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించి శ్రీలంకతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. తొలుత జెమీమా రోడ్రిగ్స్(101 బంతుల్లో 123, 15ఫోర్లు, సిక్స్) సూపర్ సెంచరీకి తోడు దీప్తిశర్మ(93), స్మృతి మందన(51) అర్ధసెంచరీలతో టీమ్ఇండియా 50 ఓవర్లలో 337/9 స్కోరు చేసింది.
9 పరుగులకే ఓపెనర్ ప్రతికా రావల్(1) నిష్క్రమించగా, మందన, రోడ్రిగ్స్ ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు. వన్డేల్లో రెండో సెంచరీ ఖాతాలో వేసుకున్న రోడ్రిగ్స్ కీలకమైన భాగస్వామ్యాలతో జట్టుకు భారీ స్కోరు అందించింది. లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 314/7 స్కోరు చేసింది. డెర్క్సెన్ (81), ట్రయన్ (67) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. అమన్జ్యోత్కౌర్ (3/59), దీప్తిశర్మ (2/57) రాణించారు.