Jemimah Rodrigues : పెళ్లి రద్దు నిర్ణయంతో వార్తల్లో నిలిచిన స్మృతి మంధాన (Smriti Mandhana)ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లకు గట్టి కౌంటర్ ఇచ్చింది జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues ). వైజాగ్ టీ20లో అర్ధ శతకంతో జట్టును గెలిపించిన తను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా మంధానకు మద్దతు తెలిపింది. పొట్టి ఫార్మాట్లో 4 వేల క్లబ్లో చేరిన రెండో క్రికెటర్‌గా చరిత్ర లిఖించిన ఆమెను అభినందించింది జెమ్మీ. తన ఇన్‌స్టా పోస్ట్‌లో మంధానను తన సోదరిగా పేర్కొంది. అంతేకాదు వైస్ కెప్టెన్ బైసెప్స్పై స్పందించి.. విమర్శకులు అవాక్కయ్యేలా చేసిందీ టీమిండియా స్టార్.
ఇటీవలే పలాశ్ ముచ్చల్‌తో పెళ్లి రద్దు చేసుకున్న స్మృతి మంధాన.. ఈమధ్యే బెంగళూరు ప్యాలెస్‌లో జరిగిన వన్ ప్లస్ కొత్త ఫోన్ లాంచ్ ఈవెంట్లో పాల్గొంది. ఆ కార్యక్రమానికి తను తెల్లని పొటవాటి స్లీవ్‌లెస్ డ్రెస్ ధరించి హాజరైంది. దాంతో.. భారత స్టార్ కండలు చూసి తను అథ్లెట్‌లా ఉందని.. ఆమె భుజాల పరిమాణం పెద్దగా ఉందని కొందరు అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారు. క్రికెటర్‌గా మంధాన ఘనతలను పొగడాల్సింది పోయి ఆమె శరీరాకృతిపై ట్రోలింగ్ చేయండం గమనించిన జెమీమా రోడ్రిగ్స్‌కు చిర్రెత్తుకొచ్చింది.
మంధానను ట్రోల్ చేస్తున్నవారికి గట్టిగా కౌంటర్ ఇవ్వాలనుకుంది. శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్‌లో 4 వేల పరుగుల మైలురాయిని అధిగమించిన మంధానను అభినందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. అందులో మా ఆమె నాకు సోదరి. తన బైసెప్స్ క్రేజీగా ఉంటాయి అని జెమ్మీ కామెట్ చేసింది. టీ20ల్లో నాలుగు వేల క్లబ్లో చేరిన రెండో మహిళా క్రికెటర్ మంధాననే. ఆమె కంటే ముందు సుజీ బేట్స్(న్యూజిలాండ్) ఈ ఘనత సొంతం చేసుకుంది.
వరల్డ్ కప్ తర్వాత మహిళల బిగ్‌బాష్ లీగ్(Big Bash League) కోసం ఆస్ట్రేలియా వెళ్లిన జెమీమా.. మంధాన పెళ్లికోసం స్వదేశం వచ్చింది. అయితే.. మంధాన తండ్రికి గుండెపోటు రావడం, పెళ్లి వాయిదా.. తదనంతర పరిణామాలతో బాధలో కూరుకుపోయిన మంధాకు తోడుగా ఉండాలనుకుంది జెమీమా. అందుకని మళ్లీ ఆసీస్ వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే.
వన్డే ఛాంపియన్‌గా తొలి మ్యాచ్‌లోనే టీమిండియా అదరగొట్టింది. ఆదివారం వైజాగ్ మైదానంలో శ్రీలంక నిర్దేశించిన 122 పరుగుల ఛేదనలో జెమీమా రోడ్రిగ్స్(69 నాటౌట్), స్మృతి మంధాన(25)లు దంచేశారు. రెండో వికెట్‌కు 54 రన్స్ జోడించి జట్టు విజయాన్ని తేలిక చేశారు. ఈ క్రమంలోనే 4 వేల పరుగుల క్లబ్లో చేరింది. మంధాన ఔటయ్యాక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(15 నాటౌట్)తో కలిసి జట్టును గెలిపించింది జెమీమా. ఆల్‌రౌండ్ షోతో లంకను చిత్తు చేసిన టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.