సిడ్నీ: భారత స్పీడ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా( Jasprit Bumrah) గాయపడ్డ విషయం తెలిసిందే. సిడ్నీ టెస్టు రెండో రోజు అతను వెన్ను నొప్పితో బాధపడ్డాడు. డాక్టర్లు అతనికి స్కానింగ్ కూడా చేశారు. బోర్డర్ – గవాస్కర్ సిరీస్‌ను 3-1 తేడాతో ఇండియా చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఆ సిరీస్‌లో బుమ్రా 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. కానీ త్వరలో ఇంగ్లండ్‌తో ప్రారంభంకానున్న స్వదేశీ సిరీస్‌లో బుమ్రా ఆడేది డౌట్‌గా ఉన్నది.
ఆస్ట్రేలియాతో జరిగిన అయిదు టెస్టుల సిరీస్‌లో అతను సుమారు 150 ఓవర్లకు పైగా బౌలింగ్ చేశాడు. దీంతో అతనికి వెన్ను పట్టేసింది. ఆ కారణంతోనే అతను సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేకపోయాడు. వర్క్‌లోడ్ పెరగడం వల్ల వత్తిడికి గురైన బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ మెడికల్ బృందం భావిస్తున్నది. నిజానికి బుమ్రా వెన్ను నొప్పి ఏ స్థాయిలో ఉందన్న విషయం ఇంకా తెలియదు. కానీ ఫిబ్రవరిలో ప్రారంభం అయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండే రీతిలో బుమ్రాను తీర్చిదిద్దాలని బీసీసీఐ భావిస్తున్నది. ఆ కారణంగానే అతనికి రెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు.
ఒకవేళ బుమ్రాకు గ్రేడ్ వన్ క్యాటగిరీ గాయమైతే, అతను కనీసం రెండు లేదా మూడు వారాల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గ్రేడ్ 2 గాయమైతే, అతను కోలుకునేందుకు ఆరు వారాలు పట్టవచ్చు. ఒకవేళ గ్రేడ్ 3 అయితే అప్పుడు కనీసం మూడు నెలల రెస్టు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాంపియన్స్ ట్రోఫీ 50 ఓవర్ల ఫార్మాట్ కావడం వల్ల.. ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో బుమ్రా ఏదైనా మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. జనవరి 22వ తేదీ నుంచి అయిదు టీ20లు జరగనున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 6 నుంచి మూడు వన్డేలు జరుగుతాయి.