Virat Kohli | టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తన నాయకత్వంలో జట్టులో సరికొత్త ప్రమాణాలను సెట్ చేశాడు. టెస్టులలో డ్రా, ఓటమి కోసం కాకుండా విజయం కాంక్షించి ఆటగాళ్లను అందుకోసం సంసిద్ధులను చేశాడు. తాజాగా అతడిపై పేసుగుర్రం జస్ప్రిత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఉన్నంతవరకూ అతడు కెప్టెన్‌గా ఉన్నా లేకపోయినా నాయకుడిగా అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరంటూ కుండబద్దలు కొట్టాడు. జట్టు ఫిట్నెస్ విషయంలో కోహ్లీ అందరికీ స్ఫూర్తిగా నిలిచాడని చెప్పాడు.
టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత ప్రస్తుతం విరామం తీసుకుంటున్న బుమ్రా.. ముంబైలో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా బుమ్రా మాట్లాడుతూ… ‘విరాట్ ఎనర్జీ పీక్స్‌లో ఉంటుంది. ఫీల్డ్‌లో అతడు నిత్యం యాక్టివ్‌గా ఉంటాడు. ఆట పట్ల అతడికి మమకారం ఎక్కువ. జట్టు ఫిట్నెస్ విషయంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పి మా అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. ప్రస్తుతం జట్టులో విరాట్ సారథిగా లేకపోయినా అతడెప్పటికీ జట్టులో నాయకుడే..’ అని వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
.@Jaspritbumrah93 describes Virat Kohli’s leadership qualities! 🤠@imVkohli • #ViratKohli • #ViratGang pic.twitter.com/pFVCuorpga
— ViratGang.in (@ViratGangIN) July 26, 2024
ధోనీ నుంచి సారథ్య పగ్గాలు అందుకున్న కోహ్లీ జట్టును విజయవంతంగా నడిపించాడు. మూడు ఫార్మాట్లలోనూ స్వదేశంతో పాటు విదేశాల్లోనూ జట్టును విజయాల బాట పట్టించాడు. తాను దూకుడుగా ఉండటమే గాక జట్టుకూ దూకుడును నేర్పాడు. భారత జట్టును అత్యున్నత స్థితిలో నిలపడంలో కోహ్లీ పాత్ర ఎంతో ఉంది. అతడి హయాంలో టీమ్ఇండియా.. టెస్టులలో వరుసగా నాలుగేండ్ల పాటు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగింది. ఐసీసీ ట్రోఫీలు తేవడంలో విఫలమయ్యాడన్న విమర్శలు మినహాయిస్తే భారత జట్టును కోహ్లీ నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాడు.