Tokyo 2020 Summer Olympics: కరోనా మహమ్మారి జపాన్‌లో విజృంభిస్తోంది. కొవిడ్ కారణంగా ఆదేశంలో జూన్ 20 వరకు ఆంక్షలు విధించారు. కరోనా వ్యాక్సినేషన్ కూడా చాలా ఆలస్యంగా మొదలుపెట్టడంతో ఇప్పటి వరకు తక్కుమందికే వ్యాక్సిన్ వేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ‘టోక్యో ఒలింపిక్స్’ వచ్చే నెలలో ప్రారంభం అవుతాయా లేదా అనేది సందేహంగా మారింది. గతేడాది జరగాల్సిన విశ్వ క్రీడలు కరోనా కారణంగా ఈ ఏడాది వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం జూలై 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఒలింపిక్స్ టోక్యో వేదికగా జరగాల్సి ఉంది. అయితే ఒలింపిక్స్ నిర్వహణపై తుది నిర్ణయం జూన్ చివరి వారంలోనే తీసుకునే అవకాశం ఉందని ఐవోసీ సీనియర్ సభ్యుడు రిచర్డ్ పౌండ్ చెప్పాడు.
ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని ఆతిథ్య నగర ప్రజలు కోరుతున్నా.. ప్రభుత్వం మాత్రం విశ్వక్రీడలను ఎలాగైనా నిర్వహించాలనే పట్టుదలతో ఉంది. మెగా ఈవెంట్‌ను రద్దు చేయాలని ప్రముఖ జపాన్ దినపత్రిక అసహి శింబున్ డిమాండ్ చేస్తోంది. విశ్వక్రీడలను నిర్వహించొద్దంటూ అక్కడి ప్రజలతో పాటు డాక్టర్లు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్ గేమ్స్ వద్దు అంటూ దేశంలోని 80 శాతం ప్రజలు కోరుకుంటున్నారని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.
కొవిడ్-19 మహమ్మారి వల్ల ప్రపంచానికి విశ్వక్రీడలను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా పోయింది. విదేశీయులను జపాన్లోకి అనుమతించకూడదని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా బయో సెక్యూర్ బబుల్‌లో క్రీడలు నిర్వహించినా.. వైరస్ దరిచేరదనే నమ్మకం లేకపోవడంతో నిర్వహకుల్లోనూ ఒకింత ఆందోళన కనిపిస్తున్నది. వైరస్ ముప్పు పొంచిఉండే ప్రమాదం ఉండటంతో ఒలింపిక్స్ వంటి మెగా టోర్నీలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
కరోనా కారణంగా ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ రద్దయితే జపాన్ 17 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12.36 లక్షల కోట్లు) నష్టపోతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. విశ్వక్రీడలు జరుగకపోతే జపాన్ ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతుందంటూ నొమూరా రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తేల్చిందని క్యోడో న్యూస్ వెల్లడించింది. క్రీడల నిర్వహణ కోసం అంచనా వ్యయం సుమారు రూ.18.28 లక్షల కోట్లుగా లెక్కిస్తున్నారు.
ఒకవేళ ఒలింపిక్స్ రద్దయితే ఐవోసీ కూడా భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ ఒలింపిక్స్‌ను నిర్వహించాలని జపాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. జపాన్ ప్రధాని యోషిహైడ్ సుగా సైతం గేమ్స్ నిర్వహించేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. ఈవెంట్ నిర్వహిస్తే భారీగా ఆదాయం సమకూరుతుందని, ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒలింపిక్ క్రీడలు కచ్చితంగా ప్రారంభమవుతాయని టోక్యో 2020 అధ్యక్షుడు సీకో హషిమోటో ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతున్నా, నిర్వాహకులు మాత్రం క్రీడలను నిర్వహించాలన్న పట్టుదలతోనే ఉన్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న భారత అథ్లెట్లు, కోచ్‌లు, అధికారులకు వ్యాక్సిన్ అందించే ప్రక్రియ మొదలైంది. జాతీయ క్రీడా సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్న భారత ఒలింపిక్స్ సంఘం (ఐవోఏ) వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మొత్తంగా 90 మందికి పైగా భారత అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 80% మంది క్రీడాకారులు వ్యాక్సిన్ తీసుకొని ఉంటారని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) అంచనా వేస్తున్నది.
The Olympic Games #Tokyo2020 will be held from 23 July until 8 August 2021.
— #Tokyo2020 (@Tokyo2020) March 30, 2020
More information here: https://t.co/ST25uXKglE pic.twitter.com/sQo1TIcH5O