Yashasvi Jaiswal : స్వదేశంలో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్‌కు కొరకరాని కొయ్యలా మారిన భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) మరో ఘనత సాధించాడు. రాంచీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన ఈ యంగ్‌స్టర్ ఇంగ్లండ్‌పై ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగలు చేసిన రెండో భారత బ్యాటర్‌గా అవతరించాడు. తద్వారా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును యశస్వీ సమం చేశాడు. కోహ్లీ 2016లో ఇంగ్లండ్ సిరీస్‌లో 655 పరుగులతో రికార్డు సృష్టించాడు.
ప్రస్తుతం యశస్వీ, కోహ్లీ.. ఇద్దరూ 655 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. సిరీస్‌లో మరో టెస్టు మిగిలి ఉండడంతో యశస్వీ.. విరాట్‌ను వెనక్కి నెట్టే చాన్స్ లేకపోలేదు. ఇంగ్లండ్‌పై ఒకే సిరీస్‌లో అత్యధిక రన్స్ కొట్టిన వాళ్లలోరాహుల్ ద్రవిడ్ 602 పరుగులతో మూడో స్థానంలో నిలవగా.. మంజ్రేకర్ 586 రన్స్‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇంగ్లండ్‌పై వరుసగా రెండో డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన యశస్వీ.. రాంచీ టెస్టు(Ranchi Test)లోనూ హాఫ్ సెంచరీ కొట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా 73 పరుగులతో రాణించాడు. దాంతో, ఈ సిరీస్‌లో యశస్వీ 600 పరుగుల మార్క్ దాటాడు. తద్వారా ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులతో రికార్డు నెలకొల్పిన క్రికెట్ దిగ్గజాలు గ్యారీ సోబర్స్, డాన్ బ్రాడ్‌మన్ సరసన నిలిచాడు.
ఒకే టెస్టు సిరీస్‌లో ఆరొందలకు పైగా రన్స్ కొట్టిన సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar), గ్రేమ్ స్మిత్, జార్జ్ హెడ్లే, నీల్ హర్వేతో కూడిన ఎలైట్ క్లబ్(Elite Club)లో చోటు దక్కించుకున్నాడు. క్రికెట్ లెజెండ్ బ్రాడ్‌మన్ 1930లో ఇంగ్లండ్‌పై ఓ రేంజ్లో చెలరేగాడు. వీరబాదుడు బాదిన అతడు ఏకంగా 974 రన్స్ కొట్టాడు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ గ్యారీ సోబర్స్(Garry Sobers) రెండో స్థానంలో నిలిచాడు. 1957-58 మధ్య పాకిస్థాన్‌పై 824 పరుగులు బాదాడు. భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ 1970-71లో వెస్టిండీస్‌పై 774 రన్స్ కొట్టి థర్డ్ ప్లేస్ సంపాదించాడు.
రంజీ ట్రోఫీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిలో పడ్డ యశస్వీ నిరుడు టీమిండియా జెర్సీ వేసుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన యశస్వీ.. ఏడు ఇన్నింగ్స్‌ల్లోనే 103 సగటుతో 618 రన్స్ కొట్టాడు. కెరీర్ మొదలెట్టిన కొన్ని రోజుల్లోనే ఈ యంగ్‌స్టర్ 2 సెంచరీలు, రెండు ఫిఫ్టీలు సాధించి భారత భావితారగా ప్రశంసలు అందుకుంటున్నాడు. బలమైన ఫుట్‌వర్క్, షాట్ సెలెక్షన్లో కచ్చితత్వం, అలవోకగా బౌండరీలు, సిక్సర్లు బాదగల నైపుణ్యం కలిగిన యశస్వీ భారత క్రికెట్‌కు తరగని ఆస్తిలా మారుతున్నాడు.