లండన్: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న వరల్డ్ టీమ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌లో భారత పురుషుల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. గ్రూప్ దశలో మొదటి పోరులోనే ట్యూనిషియాను చిత్తుచేసిన భారత్.. రెండో మ్యాచ్‌లో 3-2తో స్లోవేకియాపై పోరాడి గెలిచింది. ఇరుజట్ల మధ్య హోరాహోరీగా సాగిన పోరులో మొదట లుబొమిర్ పిస్తెజ్.. 3-2 (11-8, 5-11, 8-11, 11-5, 11-6)తో మనుష్ షాను ఓడించి షాకిచ్చాడు.
కానీ రెండో సింగిల్స్‌లో మానవ్ ఠక్కర్.. 3-0 (11-6, 11-8, 11-6)తో జాకుజ్ జెలింకాను మట్టికరిపించి స్కోర్లను 1-1తో సమం చేశాడు. మూడో సింగిల్స్‌లో వాంగ్ యాంగ్.. 3-0 (16-14, 11-5, 11-9)తో హర్మీత్‌ను చిత్తు చేయడంతో స్లోవేకియా మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. అయితే రివర్స్ సింగిల్స్‌లో మానవ్.. 3-0 (11-3, 11-3, 11-3)తో లుబొమిర్ను ఓడించగా ఆఖరి మ్యాచ్‌లో మనుష్.. 3-0 (11-8, 11-8, 11-7)తో జాకుబ్పై గెలిచి 3-2తో భారత్‌కు విజయాన్ని అందించాడు. మహిళల జట్టు రువాండాపై 3-0తో ఏకపక్ష విజయం సాధించింది.