గౌహతి: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో పేలవ ఫామ్ కొనసాగించిన టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెడ్ కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్ స్పందిస్తూ తన భవిష్యత్తును బీసీసీఐ నిర్ణయిస్తుందన్నారు. అయితే తన హయాంలో భారత జట్టు సాధించిన విజయాలను కూడా గుర్తుపెట్టుకోవాలన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 408 రన్స్ తేడాతో ఇండియా ఓటమి పాలైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నా భవిష్యత్తును నిర్ణయించేది బీసీసీఐ అని, కానీ ఇంగ్లండ్‌లోనూ, చాంపియన్స్ ట్రోఫీలోనూ ఫలితాలను అందించింది కూడా తానే అని గంభీర్ అన్నారు.
సిరీస్ ఓటమి గురించి స్పందిస్తూ నిందలు అందరికీ దక్కుతాయని, తనతోనే ఆ నిందలు మొదలవుతాయన్నారు. ఇంకా బెటర్‌గా ఆడాల్సిన అవసరం ఉందన్నారు. 95/1 ఉన్న దశ నుంచి 122/7 ఏ మాత్రం సహించబోమన్నారు. ఆ బ్యాటర్ ఆ షాట్ ఆడాల్సింది కాదు అని ఓవర్నీ నిందించలేమన్నారు. తాను ఎవరినీ నిందించలేదని, అలాంటివి చేయబోనన్నారు. హెడ్ కోచ్ గంభీర్ నేతృత్వంలో ఇండియా ఇప్పటి వరకు 18 టెస్టులు ఆడింది. దాంట్లో 10 మ్యాచుల్లో ఇండియా ఓటమి పాలైంది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లు వైట్‌వాష్ అయ్యాయి. టెస్టు క్రికెట్ ఆడేందుకు అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న క్రికెటర్లు అవసరం లేదని, కానీ తక్కువ నైపుణ్యంతో ఆడే మానసిక స్థైయిర్యం ఉన్న ఆటగాళ్లు కావాలన్నారు. వారి వల్ల టెస్టుల్లో మంచి ఫలితాలు వస్తాయన్నారు.