IND vs SA | ఇండియా-సౌతాఫ్రికా మధ్య గురువారం ఢిల్లీ వేదికగా ముగిసిన తొలి టీ20లో సఫారీలకు చరిత్రాత్మక విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు ఆ జట్టు ఆటగాడు రస్సీ వాన్ డెర్ డసెన్. ముందు నెమ్మదిగా ఆడినా ఆఖర్లో విశ్వరూపం చూపుతూ.. 46 బంతుల్లో 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే తన సక్సెస్‌కు కారణం ఐపీఎల్లో ఆడటమే అన్నాడు ఈ సఫారీ బ్యాటర్.
తొలి టీ20 ముగిశాక డసెన్ మాట్లాడుతూ.. ‘అవును అది (ఐపీఎల్) చాలా హెల్ప్ అయింది. ఐపీఎల్లో ఆడటం నాకు కలిసొచ్చింది. నేను వందలాది ఐపీఎల్ మ్యాచులు చూశాను. పెద్దగా ఆడే అవకాశం రాకపోయినా ఇక్కడి పరిస్థితులు, బౌలర్లపై అవగాహన ఉంది. సౌతాఫ్రికాతో పోలిస్తే భారత్‌లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ గత కొన్నాళ్లుగా ఉండటంతో వేడికి అలవాటుపడ్డాను..’అని తెలిపాడు.
ఐపీఎల్లో ఆడటం తనకు లాభించిందని డసెన్ చెబుతున్నా.. ఈ సీజన్లో అతడు ఆడింది మూడంటే మూడు మ్యాచులే. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ అతడిని కోటి రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. రాజస్తాన్ తరఫున మూడు మ్యాచులాడిన డసెన్.. 22 పరుగులు చేశాడు. మిగతా సీజన్ అంతా బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే దక్షిణాఫ్రికాకు మాత్రం ఇదే వరమైంది. బెంచ్ మీద ఉన్నా ఇక్కడి పరిస్థితులను ఆకలింపు చేసుకున్న డసెన్.. తనదైన శైలిలో రెచ్చిపోయి భారత్‌కు తీరని వేధనను మిగిల్చాడు.
టీ20 లలో సఫారీ జట్టుకు ఇది అత్యధిక పరుగుల ఛేదన. గతంలో ఆ జట్టు.. 2007లో జోహన్నస్‌బర్గ్‌లో వెస్టిండీస్ నిర్దేశించిన 206 పరుగులను ఛేదించింది. అదీగాక టీ20లో భారత్‌లో ఆడిన ఏ జట్టుకైనా ఇదే హయ్యస్ట్ ఛేజ్. అంతకుముందు 2015లో ఇదే దక్షిణాఫ్రికా.. ధర్మశాలలో భారత్ నిర్దేశించిన 200 రన్స్‌ను ఛేదించి రికార్డు సృష్టించింది.