ముంబై: క్రికెట్ అభిమానులకు శుభవార్త! భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో అర్ధాంతరంగా ముగిసిన ఐపీఎల్ పునః ప్రారంభానికి వేళయైంది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఒకింత సద్దుమణిగిన వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోమవారం అత్యవసరంగా సమావేశమై ఐపీఎల్ తదుపరి షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
కేంద్ర ప్రభుత్వం, సెక్యూరిటీ ఏజెన్సీలు, ఫ్రాంచైజీలతో కలిసి సుదీర్ఘంగా చర్చించిన బీసీసీఐ లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మిగిలిన 17 మ్యాచ్‌ల కోసం దేశంలో ఆరు వేదికలను ఖరారు చేసింది. ఇందులో బెంగళూరు, ముంబై, లక్నో, జైపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్ ఉన్నాయి. ఈనెల 17వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మధ్య బెంగళూరులో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ సందడి మళ్లీ మొదలు కానుంది.
ఈ క్రమంలో రెండు ఆదివారాలు లీగ్‌లో డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆరు వేదికల్లో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. లీగ్ షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ..మే 29 నుంచి క్వాలిఫయర్-1తో మొదలయ్యే ప్లేఆఫ్స్ వేదికలను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. మే 30న ఎలిమినేటర్, జూన్ 2న క్వాలిఫయర్-2, జూన్ 3న ఫైనల్ జరుగనున్నాయి.
రానున్న అంతర్జాతీయ సిరీస్‌ల షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఐపీఎల్ పూర్తి చేసేందుకు తొందరపడుతున్నట్లు తెలుస్తున్నది. జూన్ 20 నుంచి ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమ్ఇండియా..ఇంగ్లండ్‌కు బయల్దేరాల్సి ఉంది. ఇదిలా ఉంటే భారత్, పాక్ పరిస్థితులు అదుపులోకి వచ్చిన వేళ లీగ్‌లో విదేశీ ప్లేయర్ల ప్రాతినిధ్యంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే పలువురు ప్లేయర్ల తమ దేశాలకు పయనమైన సంగతి తెలిసిందే.