బెంగళూరు: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ రానే వచ్చింది. మండు వేసవిలో ఇంటిల్లిపాదిని అలరించేందుకు అన్ని హంగులతో ఐపీఎల్ ముస్తాబైంది. సొంతగడ్డపై ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ విజయాన్ని ఆస్వాదిస్తూనే ఐపీఎల్ మజాను పొందేందుకు ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 18 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని 19వ సీజన్లోకి అడుగుపెడుతున్న ఐపీఎల్..ఈసారి మరింత జోష్‌ను అందించడం ఖాయంగా కనిపిస్తున్నది. పొట్టి ప్రపంచకప్‌తో కోట్లాది మంది అభిమానుల కల నెరవేరిన వేళ ఐపీఎల్ రెట్టింపు క్రేజ్‌తో దుమ్మురేపే అవకాశముంది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) జట్ల మధ్య పోరుతో ఐపీఎల్‌కు అధికారికంగా తెరలేవనుంది. గతానికి భిన్నంగా ఈసారి ఎలాంటి ఆరంభ వేడుకలు లేకుండానే ఐపీఎల్ సాదాసీదాగా మొదలుకానుంది.
గతేడాది తొక్కిసలాటలో మరణించిన 11 మందికి నివాళిగా ఈసారి ప్రారంభ కార్యక్రమాన్ని మినహాయించారు. వారికి మద్దతుగా నిలిచేందుకు స్టేడియంలో 11 సీట్లను మృతుల కుటుంబాలకు కేటాయించారు. దీనికి తోడు మ్యాచ్ రోజు ఆర్సీబీ ప్లేయర్లంతా 11 నంబర్ జెర్సీ ధరించి ప్రాక్టీస్‌లో పాల్గొననున్నారు. 18 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ నిరుడు ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడిన ఆర్సీబీ మరోమారు అదే ఫీట్‌ను పునరావృతం చేయాలని చూస్తున్నది. పరుగుల వరద పారే అవకాశమున్న చిన్నస్వామిలో సన్‌రైజర్స్‌ను తొలి పోరులో ఎలా ఎదుర్కొవాలనే దానిపై దృష్టి పెట్టింది. స్టార్ బౌలర్ల గైర్హాజరీలో ఇరు జట్లు ఒకింత బలహీనంగా కనిపిస్తున్నా.. బ్యాటింగ్ పరంగా చాలా బలంగా ఉన్నాయి. చిన్నస్వామి ఫ్లాట్ వికెట్‌పై ఈసారి 300 మార్క్ టచ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓవైపు ఇషాన్ కిషన్, అభిషేక్‌శర్మ, హెడ్, క్లాసెన్‌తో హైదరాబాద్ దుర్బేద్యంగా కనిపిస్తుంటే..కోహ్లీ, డేవిడ్, సాల్ట్, బెతెల్, రజత్, షెఫర్డ్‌తో ఆర్సీబీ అంతే పటిష్టంగా ఉంది.