ECB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ హీరో ఫిల్ సాల్ట్(Phil Salt)కు జాక్‌పాట్ తగిలింది. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) తరఫున 17వ సీజన్లో రెచ్చిపోయి ఆడిన సాల్ట్‌ను ఇంగ్లండ్ (England)టీ20 కెప్టెన్సీ వరించింది. రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ (Jos Buttler) గాయపడడంతో సెలెక్టర్లు విధ్వంసక ఓపెనర్, వికెట్ కీపర్ అయిన సాల్ట్‌కు సారథ్య పగ్గాలు అప్పగించారు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టును అతడు నడిపించనున్నాడు.
టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌లోనూ ఇంటిదారి పట్టిన ఇంగ్లండ్ స్వదేశంలో పొట్టి సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఇంతలోనే ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ కాలి మడమ కండరాల గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. దాంతో, సాల్ట్ తాత్కాలిక సారథిగా ఎంపికయ్యాడు. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌కు రానుంది. 11వ తేదీ నుంచి 15వ తేదీలోపు పొట్టి సిరీస్ జరుగనుంది.
Wishing you all the best in your recovery, Jos 👊
— England Cricket (@englandcricket) September 5, 2024
అయితే.. ఆ తర్వాత జరుగనున్న వన్డే సిరీస్‌లోపు బట్లర్ కోలుకోవడం సందేహంగానే ఉంది. ఐపీఎల్ 17వ సీజన్లో సాల్ట్ సంచలన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. సునీల్ నరైన్(Sunil Narine)తో కలిసి కోల్‌కతాకు శుభారంభాలు ఇస్తూ.. ఆ జట్టు మూడోసారి టైటిల్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. క్రీజులో ఉన్నంతసేపు ఊచకోత కొనసాగించిన సాల్ట్ 435 పరుగులతో అదరహో అనిపించాడు.
ఇంగ్లండ్ టీ20 స్క్వాడ్ : ఫిల్ సాల్ట్(కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెతెల్, బ్రైడన్ కార్సే, జోర్డన్ కాక్స్, సామ్ కరన్, జోష్ హల్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, సకీబ్ మహమూద్, డాన్ మౌస్లే, జేమే ఓవర్టన్, ఆదిల్ రషీద్, రీసే టాప్లే, జాన్ టర్నర్.
‘ఆస్ట్రేలియాతో సెప్టెంబర్ 11వ తేదీన టీ20 సిరీస్ మొదలవ్వనుంది. సర్జీ జట్టు ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ను టీ20 స్క్వాడ్‌లో తీసుకున్నాం. ఇక వన్డే స్క్వాడ్‌లోకి బ్యాకప్‌గా ఎస్సెక్స్ బ్యాటర్ జోర్డాన్ కోక్స్ను ఎంపిక చేశాం’ అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఒకవేళ వన్డే సిరీస్‌లోపు బట్లర్ ఫిట్‌గా లేకుంటే యువ సంచలన హ్యారీ బ్రూక్(Harry Brook) వన్డే సారథిగా ఎంపికయ్యే అవకాశం ఉందని ఈసీబీ వర్గాలు చెప్పాయి.