హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రలో మరోమారు ఐఏఎస్ అధికారులు భారీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా బదిలీల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేశ్ రంజన్‌ను సీఎంవోనుంచి ఉద్వాసన పలికారు. మెట్రోపాలిటన్ ఏరియా స్పెషల్ చీఫ్‌సెక్రటరీగా జయేశ్ రంజన్‌ను నియమించారు. ఆయన పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్‌గా కూడా కొనసాగనున్నారు. కొంతకాలంగా సీఎంవోలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జయేశ్ రంజన్.. తన పరిధి దాటి పరిశ్రమల శాఖ వ్యవహారాల్లో నిత్యం తలదూర్చుతుండం, అక్కడి అధికారులపై కర్రపెత్తనానికి ప్రయత్నించడం పలుమార్లు వివాదాస్పదమైంది.
పరిశ్రమలశాఖ మెయిల్ ఐడీని దగ్గర పెట్టుకొని, ఆ శాఖ ప్రిన్సిపల్ సెకట్రరీ సంజయ్‌కుమార్‌ను ఇబ్బంది పెట్టారని విమర్శలు వచ్చాయి. దీనిపై ఇటీవల సంజయ్ నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు కూడా చేశారు. పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్‌కు మళ్లించేలా ప్రభుత్వం రూపొందించిన హిల్ట్ పాలసీ వెనుక జయేశ్ రంజన్ ఉన్నారని ఇటీవల రాజకీయ పక్షాల నుంచి ఆరోపణలు వినవచ్చాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పాలసీ వివరాలను ప్రజలముందు ఉంచి, భూముల పరిరక్షణకు ఉద్యమించడంతో రేవంత్ సర్కారు ఆత్మరక్షణలో పడింది. మరోవైపు ప్రభుత్వం గొప్పగా ఊదరగొట్టిన గ్లోబల్ సమ్మిట్ ఫెయిల్ కావడం, ఆశించిన మేర ఫలితాలు రాకపోవడం కూడా జయేశ్‌రంజన్ బదిలీకి కారణంగా చెప్తున్నారు. పెట్టుబడుల లెక్కలు తప్పు చెప్పడం ద్వారా ప్రభుత్వానికి తలవంపులు తెచ్చారని భావిస్తున్నందునే ఆయనపై బదిలీ వేటు వేశారని సమాచారం.
సిరిసిల్ల కలెక్టర్‌గా ఉన్న ఎం హరితను టీజీపీఎస్సీ కార్యదర్శిగా బదిలీ చేశారు. అక్కడే అదనపు కలెక్టర్‌గా విధుల్లో ఉన్న గరిమా అగర్వాల్‌కు సిరిసిల్ల కలెక్టర్‌గా పూర్తి బాధ్యతలు అప్పగించారు. భవేశ్మిశ్రాను ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్ అడిషనల్ సీఈవోగా ప్రభుత్వం నియమించింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఈవీ నరసింహారెడ్డి నియమితులయ్యారు.
అలాగే నిర్మలా కాంతి వెస్లీని హ్యూమన్‌రైట్స్ కమిషన్ సెక్రటరీగా, హనుమంతు నాయక్‌ను ఎస్సీ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు వీసీ అండ్ ఎండీగా నియమించారు. భువనగిరి అదనపు కలెక్టర్ జీ వీరారెడ్డిని టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, వికారాబాద్ అదనపు కలెక్టర్ జీ లింగ్యానాయక్‌ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెక్రటరీగా నియమించారు. హైదరాబాద్ అదనపు కలెక్టర్ (లోకల్‌బాడీ)గా జీ జితేందర్‌రెడ్డిని, ఆ స్థానంలో ఉన్న కదివరన్ను అడిషన్ కలెక్టర్ (రెవెన్యూ)గా బదిలీ చేశారు. అలాగే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా బీ షఫీఉల్లా(ఐఎఫ్ఎస్)కు బాధ్యతలు అప్పగించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పలువురు ఐఏఎస్‌లకు జోనల్ కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. శేర్లింగంపల్లి జోన్ కమిషనర్‌గా బోర్గాడే హేమంత్ సహదేవ్‌రావు, కూకట్‌పల్లికి అపూర్వచౌహాన్, కుత్బుల్లాపూర్‌కు సందీప్‌కుమార్‌ఝా, చార్మినార్‌కు ఎస్ శ్రీనివాస్‌రెడ్డి, గోల్కొండకు జీ ముకుందర్‌రెడ్డి, ఖైరతాబాద్‌కు ప్రియాంక ఆల, రాజేంద్రనగర్‌కు అనురాగ్ జయంతి, సికింద్రాబాద్‌కు రవికిరణ్, శంషాబాద్‌కు కే చంద్రకళ, ఎల్బీనగర్కు హేమంత్‌కేశవ్ పాటిల్, మల్కాజిగిరికి సంచిత్ గంగ్వార్, ఉప్పల్ జోనల్ కమిషనర్‌గా రాధికా గుప్తాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.