ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన, అడవుల జిల్లాగా పేరుగాంచింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి ప్రత్యేక దృష్టి సారించింది. ఫలితంగా అభివృద్ధిలో ఆదిలాబాద్ ఇతర జిల్లాలతో పోటీ పడుతున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ రంగం క్రమంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే రెండు కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా 300 మంది యువత ఉపాధి పొందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండేండ్ల కిందట రూ.40 కోట్లతో మంజూరు చేసిన ఐటీ టవర్ పనులు తుది దశకు చేరుకున్నాయి.
– ఆదిలాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ)
ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో ఐటీ రంగాన్ని విస్తరించడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించడంతో హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి నగరాలకు పరిమితమైన ఐటీ కంపెనీలు ఆదిలాబాద్‌లో ఐటీ కంపెనీలు ఏర్పాటు అయ్యాయి. కంపెనీల ఏర్పాటుకు అవసరమైన సాయం అందించారు.
బీఆర్ఎస్ సర్కారు అందించిన సహకారంతో ఆదిలాబాద్‌లో నాలుగు సంవత్సరాల కిందట ఐటీ కంపెనీ ప్రారంభం కాగా మరో రెండేండ్ల కిందట మరో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించింది. నాలుగేండ్లుగా ఐటీ కార్యకలాపాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఐటీ కంపెనీలు ప్రారంభంకాక ముందు ఉన్నత చదువులు అభ్యసించిన యువత ఐటీ కంపెనీల్లో పనిచేయడానికి హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు సొంత జిల్లాలో మంచి కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ రంగం విస్తృత పర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. మావల మండలంలోని బట్టిసవర్గాంలోని సర్వే నంబరు 72లో మూడెకరాల స్థలంలో రూ.40 కోట్లతో ఐటీ టవర్‌ను నిర్మాణాన్ని చేపట్టింది. అన్ని హంగులతో 68 వేల చదరపు అడుగుల వైశాల్యంలో జీ ప్లస్ ఫోర్ భవనం నిర్మిస్తుండగా పనులు చివరి దశకు చేరుకున్నాయి. అంచనా వ్యయం పెరుగగా ప్రస్తుతం ప్రభుత్వం మరో రూ.10 కోట్లు మంజూరు చేసింది. త్వరలోనే పలు కంపెనీలు ఈ టవర్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలు ఉండగా 1900 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి టవర్ పనులు పూర్తికానున్నట్లు అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో ఐటీ కంపెనీల ఏర్పాటు ఫలితంగా జిల్లా అభివృద్ధితోపాటు వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు పెరగడంతోపాటు పరోక్షంగా స్థానికులకు ఉపాధి లభిస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో ఇంజినీరింగ్ చదువుకున్న యువకులు ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, పుణెతో వంటి పట్టణాలకు వెళ్లాల్సి వస్తున్నది. నగరాల్లో ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులతోపాటు కంపెనీకి వెళ్లాలంటే కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. దీంతోపాటు కుటుంబస భ్యులకు దూరంగా ఉంటున్నారు. పండుగలు, ఇతర పనుల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ఆదిలాబాద్ పట్టణంలో ఇప్పటికే రెండు ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. కొత్తగా నిర్మించే ఐటీ టవర్‌లో పలు కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలున్నాయి. దీంతో జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ పట్టభద్రులు స్థానికంగా ఉద్యోగం చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ఉండవచ్చు.
– బుట్టి శివకుమార్, ఆదిలాబాద్
ఆదిలాబాద్ పట్టణంలో ఐటీ టవర్ నిర్మాణం వల్ల చాలా కంపెనీలు ప్రారంభమవుతాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది యువతీ యువకుతలకు ఉపాధి పొందే అవకాశాలున్నాయి. ఐటీ ఉద్యోగులకు మంచి వేతనాలు ఉండడంతో జిల్లాలో వాణిజ్య, వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. గతంలో నగరాలకు మాత్రమే పరిమితమైన ఐటీ రంగం బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా ఆదిలాబాద్ జిల్లాకు విస్తరించింది. ఐటీ టవర్ మంజూరు చేయడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువకులకు ఉద్యోగాలు వస్తాయి. జిల్లా కేంద్రం అభివృద్ధి చెందుతుంది.
– కలీం, ఆదిలాబాద్