Paul Valthaty : ఇండియన్ ప్రీమియర్ లీగ్ సంచలనం పౌల్ వాల్తాటీ (Paul Valthaty) జాక్‌పాట్ కొట్టాడు. ఒకప్పుడు పవర్ హిట్టర్‌గా ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన పౌల్ ప్రస్తుతం అమెరికాలోని ఓ జూనియర్ జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యాడు. మైనర్ క్రికెట్ లీగ్ (Minor Cricket League)లో సియాటెల్ థండర్‌బోల్ట్స్ జట్టుకు అతడు కోచ్‌గా సేవలందిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎంసీఎల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
‘సియాటెల్ థండర్‌బోల్ట్స్ జట్టు తమ లైనప్‌లో ఒక బిగ్ హిట్టర్‌ను చేర్చుకుంది. పంజాబ్ కింగ్స్ మాజీ సంచలనం పౌల్ వాల్తాటీ సియాటెల్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడనే విషయం మీతో పంచుకుంటున్నందుకు చాలా థ్రిల్‌గా ఉంది’ అని ఎంసీఎల్ తెలిపింది. వాల్తాటీ కూడా కొత్త అవతారంలో మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
View this post on Instagram
A post shared by Seattle Thunderbolts Cricket Academy (@thunderbolts_cricket_academy)
‘ముంబై, ఐపీఎల్లో ఆడిన నా అనుభవాన్ని సియాటెల్ జట్టుకు చెందిన యువకెరటాలతో పంచుకునేందకు ఉత్సాహంగా ఉన్నాను’ అని వాల్తాటీ అన్నాడు. ఈమధ్యే సియాటెల్ ఫ్రాంచైజీ ఓ వీడియో విడుదల చేసింది. అందులో వాల్తాటీ కొందరు పిల్లలకు క్రికెట్ పాఠాలు చెబుతున్నాడు.
ముంబై క్రికెటర్ అయిన వాల్తాటీ 2011లో పంజాబ్ కింగ్స్(Punjuab Kings) తరఫున దుమ్మురేపాడు. అయితే.. ఆ తర్వాతి సీజన్లో మాత్రం మనోడు తేలిపోయాడు. దాంతో, 2013లో అతడికి ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కలేదు. అంతేకాదు భారత జట్టుకు ఆడాలన్న అతడి కల కూడా నిజం కాలేదు. కెరీర్ ఆరంభంలో అదరగొట్టిన వాల్తాటీ ఆ తర్వాత గాయాల కారణంగా సర్జరీ చేసుకున్నాడు. దాంతో , అతడి ఫామ్ పోయింది. ఐపీఎల్లో సైతం ఇక తనకు అవకాశాలు రావని తెలియడంతో 39 ఏండ్ల వయసులో అతడు నిరుడు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.