బెంగళూరు: ఒక హోటల్ సమీపంలో పేలుడు పదార్థాలు లభించాయి. ప్లాస్టిక్ బ్యాగ్‌లో జిలెటిన్ స్టిక్స్‌ను, ఒక బాక్స్‌లో నాటు బాంబును గుర్తించారు. (Explosives in plastic bag) ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. టి నరసిపురాలోని ఒక హోటల్ సమీపంలో ప్లాస్టిక్ సంచిలో దాచిన తొమ్మిది జిలెటిన్ స్టిక్స్, ఒక అట్టపెట్టెలో ఉంచిన నాటు బాంబును అక్కడి సిబ్బంది గుర్తించారు. సమీపంలోని చెట్టుకు వేలాడుతున్న అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఇవి ఉండటం చూసి షాక్ అయ్యారు. వీటి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాళ్ల పేలుళ్ల కోసం జిలెటిన్ స్టిక్స్, అడవి పందులను వేటాడేందుకు నాటు బాంబులను ఈ ప్రాంతంలో వినియోగిస్తారని పోలీసులు తెలిపారు. అయితే వీటిని ఎక్కడి నుంచి ఎవరు తెచ్చారు అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడు పదార్థాల పట్ల ఎలాంటి భయాందోళన అవసరం లేదని పోలీస్ అధికారి వెల్లడించారు.