గుజరాత్‌తో రాజస్థాన్ అమీతుమీ
లీగ్‌లో అడుగుపెట్టిన తొలిసారే పాయింట్ల పట్టిక టాప్‌లో నిలిచిన జట్టు ఓ వైపు.. అప్పుడెప్పుడో లీగ్ ఆరంభ సీజన్లో టైటిల్ గెలిచిన టీమ్ మరో వైపు.. మిడిలార్డర్లో హిట్టర్లతో దట్టంగా ఉన్న జట్టు ఒకటైతే.. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్స్‌తో కసిమీద ఉన్న టీమ్ మరొకటి.. మొదటి సారే టైటిల్ పట్టాలని తహతహలాడుతున్నది ఒకరైతే.. ప్లే ఆఫ్స్‌లో ఉన్న నాలుగు జట్లలో గతంలో టైటిల్ నెగ్గిన ఏకైక టీమ్ మరొకటి..
దాదాపు రెండు నెలలుగా మండు వేసవిలో వినోదాల విందును పంచిన ఐపీఎల్-15వ సీజన్ చివరి అంకానికి వచ్చే సింది. క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో పదింట నెగ్గిన గుజరాత్ కాస్త బలంగా కనిపిస్తుండగా.. తొమ్మిది విజయాలతో రెండో స్థానంలో నిలిచిన రాయల్స్ రెండో సారి టైటిల్ పట్టాలని ఉవ్విళ్లూరుతున్నది. మరి రెండు అత్యుత్తమ జట్ల మధ్య జరుగనున్న రసవత్తర పోరును ఆస్వాదించేందుకు మీరూ సిద్ధమైపోండి!
కోల్‌కతా: ఐపీఎల్ 15వ సీజన్లో తొలి ఫైనలిస్టు ఎవరో తేలిపోయే సమయం ఆసన్నమైంది. మంగళవారం గుజరాత్, రాజస్థాన్ మధ్య జరుగనున్న పోరులో గెలిచిన జట్టు నేరుగా ఆదివారం జరుగనున్న ఐపీఎల్ ఫైనల్‌కు అర్హత సాధించనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం దక్కనుంది. సీజన్ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్న హార్దిక్ పాండ్యా సేన అదే జోష్‌తో ఫైనల్ చేరాలని చూస్తుంటే.. అండర్ డాగ్స్‌గా అడుగుపెట్టి సంచలనం రేపాలని రాజస్థాన్ కృతనిశ్చయంతో ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నా.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ల విషయంలో గుజరాత్ వైపు కాస్త మొగ్గు కనిపిస్తున్నది. వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియాతో కూడిన గుజరాత్ బ్యాటింగ్ శత్రు దుర్భేద్యంగా కనిపిస్తుండగా.. బౌలింగ్‌లో మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, ఫెర్గూసన్ కీలకం కానున్నారు. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో పదింట నెగ్గి 20 పాయింట్లు ఖాతాలో వేసుకున్న గుజరాత్ ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలువగా.. ఆఖరి మ్యాచ్‌లో చక్కటి విజయంతో రాజస్థాన్ రెండో స్థానానికి చేరింది.
అత్యధిక వీరుల జట్టు..
తాజా సీజన్లో అత్యధిక పరుగుల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న జోస్ బట్లర్ (629 రన్స్; ఆరెంజ్ క్యాంప్).. వికెట్ల వీరుడు యుజ్వేంద్ర చాహల్ (26; పర్పుల్ క్యాప్) జట్టులో ఉండటంతో రాజస్థాన్ బలంగా కనిపిస్తున్నది. రవిచంద్రన్ అశ్విన్ అటు బంతితో ఇటు బ్యాట్‌తో రాణిస్తుండటం రాయల్స్‌కు అదనపు బలంగా మారింది. హెట్‌మైర్, రియాన్ పరాగ్ వంటి రెగ్యులర్ ఆటగాళ్ల కంటే ముందు క్రీజులోకి వస్తున్న అశ్విన్.. ఈ సీజన్లో తన విలువ చాటుకున్నాడు. లీగ్ ఆరంభంలో శతకాలతో అదరగొట్టిన జోస్ బట్లర్ చివరికొచ్చేసరికి గాడి తప్పినట్లు కనిపిస్తున్నాడు. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో బట్లర్ వరుసగా2,2,7 పరుగులతో నిరాశ పరిచాడు. తాజా సీజన్లో మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన జోస్.. ఆరంభ దశ తరహాలనే చెలరేగుతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేయగా.. యశస్వి జైస్వాల్ మంచి టచ్‌లో ఉన్నాడు. సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్ భారీ ఇన్నింగ్స్‌లు బాకీ ఉండగా.. హెట్‌మైర్, పరాగ్ ఫినిషింగ్ బాధ్యత చూసుకుంటున్నారు. బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్, అశ్విన్‌తో పాటు బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, మెక్కాయ్ మంచి జోరు మీదున్నారు.
హార్దిక్‌పైనే ఆశలు..
ఐపీఎల్లో తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా తన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. గాయం కారణంగా బౌలింగ్‌కు దూరమైన అతడు.. తాజా సీజన్లో బ్యాట్‌తో పాటు బంతితో నిలకడగా రాణిస్తున్నాడు. దీంతో పాటు సారథిగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. మిల్లర్, తెవాటియా వంటి హిట్టర్లు అందుబాటులో ఉండటంతో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న హార్దిక్.. తన వికెట్ విలువ గుర్తెరిగి వ్యవహరిస్తున్నాడు. రషీద్ ఖాన్ కూడా బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తుండటం ఆ జట్టుకు అదనపు బలంగా మారింది. టాపార్డర్‌లో శుభ్‌మన్ గిల్ మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోవడంతో పాటు సీనియర్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా నిలకడ కొనసాగలేకపోవడం టైటాన్స్‌ను కాస్త ఇబ్బంది పెడుతున్నది. ఇక బౌలింగ్‌లో మహమ్మద్ షమీ ఆరంభంలోనే బ్రేక్ త్రూలు ఇప్పించి జట్టుకు శుభారంభాలు అందిస్తుండగా.. డెత్ ఓవర్స్‌లో రషీద్ కట్టిపడేస్తున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లోని తాజా వికెట్‌పై మ్యాచ్ జరుగనుండటంతో హార్దిక్ జట్టులో మార్పులు చేస్తాడా చూడాలి. లీగ్ దశలో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 37 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఆరంభంలో వరుస విజయాలు సాధించిన టైటాన్స్.. లీగ్ దశలో ఆడిన ఆఖరి ఐదు మ్యాచ్‌ల్లో మూడింట నెగ్గడం కాస్త ఆందోళన పరుస్తున్నది.
వర్షం పడితే.. సూపర్ ఓవర్
అనివార్య కారణాల వల్ల ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు అంతరాయం కలిగితే.. సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించనున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. కనీసం ఒక ఓవర్ జరిగే అవకాశం కూడా లేని పరిస్థితిలో లీగ్ దశలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటించనున్నట్లు ఐపీఎల్ పేర్కొంది. ‘ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల్లో కచ్చితంగా ఐదు ఓవర్ల ఆట సాగాలనే నిబంధనలో మార్పులు చేశాం. ఎలిమినేటర్, క్వాలిఫయర్-1,2, ఫైనల్ మ్యాచ్‌లు నిర్ణీత సమయంలో సజావుగా సాగకపోతే.. కనీసం సూపర్ ఓవర్ ద్వారానైనా విజేతను నిర్ణయిస్తాం’ అని ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంది.
తుది జట్లు (అంచనా)
గుజరాత్: హార్దిక్ (కెప్టెన్), గిల్, సాహా, వేడ్, మిల్లర్, తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, షమీ, ఫెర్గూసన్, యష్ దయాల్.
రాజస్థాన్: శాంసన్ (కెప్టెన్), బట్లర్, జైస్వాల్, పడిక్కల్, హెట్‌మైర్, పరాగ్, అశ్విన్, బౌల్ట్, మెక్కాయ్, చాహల్, కుల్దీప్ సేన్.