IPL Mega Auction | క్రికెట్ అభిమానులకు కనువిందు చేసే ఐపీఎల్-2025 కోసం ఆటగాళ్ల వేలం సరికొత్త రికార్డులు పలుకుతున్నది. జనరేషనల్ టాలెంట్ గా రిషబ్ పంత్ , శ్రేయస్ అయ్యర్ ల కోసం ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక బిడ్ దాఖలైంది. రిషబ్ పంత్ కోసం బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడ్డాయి. చివరకు లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు సొంతం చేసుకున్నది. అంతకు ముందు టీం ఇండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. తొలుత రూ.2 కోట్లు ఉన్న శ్రేయాస్ అయ్యర్ కోసం కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డా.. మధ్యలో పంజాబ్ కింగ్ ఎలెవెన్ ఎగరేసుకు పోయింది.
రూ.2 కోట్ల కనీస ధర గల టీం ఇండియా పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కోసం తొలుత చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. మధ్యలో గుజరాత్ టైటాన్, రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు, రాజస్థాన్ బిడ్ వేసినా ఉపయోగం లేకపోయింది. ఆర్టీఎం కార్డుతో అర్ష్ దీప్‌ను రూ.18 కోట్లకు పంజాబ్ ఎలెవెన్ గెలుచుకున్నది.
ఇక లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం అయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ మాజీ సారధి కేఎల్ రాహుల్ ను రూ.14 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకున్నది. గాయంతో కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న ఇండియన్ పేస్ బౌలర్ మహ్మద్ షమీని సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.10 కోట్లకు గెలుచుకున్నది. ఆదివారం నిర్వహించిన మెగా ఐపీఎల్ వేలంలో తొలుత అమ్ముడు పోయింది అర్ష్ దీప్ సింగ్. గతేడాది దుబాయిలో వేలం నిర్వహించగా, దేశం ఆవల ఐపీఎల్ వేలం వేయడం ఇది రెండోసారి. జెడ్డా వేదికగా ఆదివారం ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ప్రక్రియ సాగింది. ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు స్టార్క్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.11.75 కోట్లకు సొంతం చేసుకుంటే, గుజరాత్ టైటాన్స్ .. ఇంగ్లిష్ బ్యాటర్ జాస్ బట్లర్ రూ.15.75 కోట్లకు అమ్ముడు పోయాడు.