IPL 2025 : పది రోజులకు పైగా వాయిదా పడిన ఐపీఎల్ 18వ సీజన్ పునః ప్రారంభం కానుంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పోరుతో మళ్లీ బ్యాటర్ల విధ్వంసానికి తెర లేవనుంది. విదేశీ క్రికెటర్లు కొందరు టోర్నీకి దూరమైనా.. ప్లే ఆఫ్స్ పోరులో నిలిచేందుకు ఏడు జట్లు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమయ్యాయి. లీగ్ దశ ముగింపు దశకు వచ్చినందుకు ఇకపై ప్రతి మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.
తొలి టైటిల్ కలను సాకారం చేసుకోవాలనుకుంటున్న ఆర్సీబీ.. కోల్‌కతాపై విజయం సాధిస్తే నాకౌట్ పోరుకు దూసుకెళ్లుతుంది. టేబుల్ టాపర్ గుజారత్ టైటాన్స్(Gujarat Titans) కూడా ఒక్క అడుగు దూరంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిస్తే శుభ్‌మన్ గిల్ సేన బెర్తు ఖరారు చేసుకుంటుంది. మరి మిగతా రెండు జట్లు ఏవి? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Inching closer to action ⏳
1️⃣ day until we get going again 👊 #RCBvKKR on the horizon 🤜🤛#TATAIPL | @RCBTweets | @KKRiders pic.twitter.com/K8VJcxjnBO
— IndianPremierLeague (@IPL) May 16, 2025
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలతో ఐపీఎల్ వారం రోజులు వాయిదా పడింది. మే 9న ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రద్దుతో లీగ్‌ను సస్పెండ్ చేసింది బీసీసీఐ. అయితే.. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం కుదరగా.. మే 17 నుంచి లీగ్‌ను పునరుద్ధరించేందుకు బీసీసీఐ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతానికి గుజరాత్, ఆర్సీబీ జట్లు తలా ఎనిమిదేసి విజయాలతో వరుసగా 1, 2 స్థానాల్లో ఉన్నాయి. ఈ ఎడిషన్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్నింటా దుమ్మురేపుతున్న పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో మూడో ప్లేస్‌లో ఉంది.
ఆరంభంలో తడబడినా.. అనూహ్యంగా పుంజుకున్న మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అయితే.. గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్‌లకు ఇంకా మూడు లీగ్ మ్యాచ్‌లుండగా.. ముంబైకి మాత్రం రెండో ఉన్నాయి. వాటిలో ఒక్కటి ఓడినా.. ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆడే అవకాశాలు తగ్గిపోతాయి.
#TATAIPL is back in action on 17th May 🗓
With the playoff race heating up, which fixture are you most excited for? 🙌
Check out the full schedule 🔽 pic.twitter.com/OoRlYEpAUb
— IndianPremierLeague (@IPL) May 14, 2025
ఇక.. ఢిల్లీ క్యాపిటిల్స్, ఢిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్ చేరాలనే కసితో ఉన్నాయి. కానీ, ఇప్పటికే 12 మ్యాచులు ఆడిన అజింక్యా రహానే బృందం తదుపరి రెండు మ్యాచుల్లో గెలవాలి. దాంతో, 16 పాయింట్లు చేరినా ఇతర జట్ల పాయింట్లు, రన్‌రేటే మీద ఆధారపడాల్సి వస్తుంది. రిషభ్ పంత్ నేతృత్వంలోని లక్నో, అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ ఇంకో మూడేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.