Koppula Eshwar | మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు. తమ నేతలను బిల్లా రంగా అని మా నేతలను సంబోధించడం ద్వారా రేవంత్ రెడ్డి సీఎం పదవి స్థాయిని తగ్గించారని ఆరోపించారు. బిల్లా రంగాల చేష్టలు రేవంత్ రెడ్డివే అని విమర్శించారు. బిల్లా రంగాల స్థాయిని కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడో దాటిపోయారని.. చార్లెస్ శోభరాజ్‌ను మించిపోయారని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో కకొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. పాలన చేతగాక పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రాజకీయ పార్టీల నాయకత్వం అనేది వాటి అంతర్గత వ్యవహారమని కొప్పుల ఈశ్వర్ అన్నారు. మహేశ్ కుమార్ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా మమ్మల్ని అడిగి చేశారా అని నిలదీశారు. ఆయన్ను ఎందుకు పీసీసీ అధ్యక్షుడిని చేశారు.. ఆ పదవి దళితుడికి ఎందుకు ఇవ్వలేదని మేమైనా అడిగామా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పని చేసే పార్టీ అని.. ఎవరైతే తెలంగాణ ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుందో వారినే బీఆర్ఎస్ ఎంచుకుంటుందని స్పష్టం చేశారు. 2014కి ముందు దళిత ముఖ్యమంత్రి అని అన్నారని.. అప్పటికీ మేం అధికారంలోకి రాలేదని.. విజయ రామారావును బీర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా నియమించారని గుర్తుచేశారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్నిఅభివృద్ధి చేసే విజన్‌ను సిద్దం చేసుకున్న కేసీఆర్ సీఎం అయితేనే మంచిది అనుకుని పార్టీ తెలంగాణ ముక్త కంఠంతో నిర్ణయం తీసుకుందని తెలిపారు. అందుకే దళితుడు సీఎం కాలేదని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చిన రాష్ట్రం కనుక కేసీఆర్ తప్ప ఎవ్వరు సీఎం అయినా రాష్ట్రానికి నష్టం జరిగేదని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయినంక రాష్ట్ర పరిస్థితి ఏమైందో చూస్తునే ఉన్నామని అన్నారు. ఖర్గే ఏఐసీసీ డమ్మీ అధ్యక్షుడు అని.. నడిపేదంతా రాహుల్ గాంధీ అని జనానికి తెలియదా అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జపం తప్ప ఇంకేమైనా ఉందా అని ప్రశ్నించారు. రాహుల్, ప్రియాంకలకు ఏ హోదా ఉన్నదని గత ఎన్నికల్లో డిక్లరేషన్లను వారితో రేవంత్ రెడ్డి ప్రకటింపజేశారని అడిగారు. హామీల అమలుకు తమది గ్యారంటీ అని వాళ్ళు ఎలా చెప్పారని ప్రశ్నించారు.
బీఆర్ఏస్ పగ్గాలు దళితునికి ఇవ్వాలంటున్న రేవంత్ రెడ్డి.. ఖర్గేను పీఎం చేస్తామని ఎందుకు అనడం లేదని.. రాహుల్ గాంధీని పీఎం చేస్తామని ఎందుకు అంటున్నారని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. రాహుల్ నాయకత్వంలో పని చేద్దామని రేవంత్ అంటారే తప్ప ఖర్గే నాయకత్వం గురించి మాట్లాడతారా అని అడిగారు. కులగణన రాహుల్ చెబితే చేశామని అంటాడు తప్ప ఖర్గే సూచనలతో అని ఎపుడైనా రేవంత్ అన్నాడా అని ప్రశ్నించారు. 50 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కుల గణన ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.
దళితుల పట్ల కాంగ్రెస్‌ది, రేవంత్ రెడ్డిది మొసలి కన్నీరే.. పదవుల మీద ప్రేమ తప్ప దళితులకు పదవులిచ్చే ప్రేమకాదని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. మల్లిఖార్జున ఖర్గేను పార్టీ అధ్యక్షుడిగా చేశారని అంటున్నారని. 1985 నుండి ఇప్పటి వరకు ఎంతమంది దళితులను ప్రెసిడెంట్‌గా చేశారని నిలదీశారు. 98 మంది ప్రెసిడెంట్లలో కనీసం నలుగురు దళితులు లేరు. గాంధీ కుటుంబానికి తప్ప వేరే ఎవరికైనా ప్రధాని పదవిని ఇచ్చారా? అని సూటిగా ప్రశ్నించారు. పీవీని కనీసం పోగు పోయనివ్వలేదు.. మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేసి, చైర్మన్ గా సోనియా గాంధీ అసలు అధికారం వెలగబెట్టిందని మండిపడ్డారు. మోతిలాల్ నెహ్రూ రెండేళ్లు, జవహర్లాల్ నెహ్రూ 9 ఏండ్లు, ఇందిరాగాంధీ ఆరేండ్లు, రాజీవ్ గాంధీ ఆరేండ్లు, సోనియా గాంధీ 21 ఏండ్లు, రాహుల్ గాంధీ రెండేళ్లు మొత్తం కుటుంబం కాంగ్రెస్ కు 46 ఏండ్లు అధ్యక్ష స్థాయిలో ఉన్నారని.. ఇదేనా మీ సామాజిక న్యాయమని ప్రశ్నించారు. దళితుల్లో దామోదర సంజీవయ్య, జగ్జీవన్ రామ్, ఖర్గేలు మాత్రమే AICC అధ్యక్షులుగా ఉన్నారని.. వీరి పదవి కాలం ముష్టి మూడేళ్లు మాత్రమే అని అన్నారు.
జనం మార్పు కోరుకున్నారు కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారని కొప్పుల ఈశ్వర్ అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే దామోదర రాజనరసింహను లేదా వివేక్ వెంకటస్వామిలను ముఖ్యమంత్రిని చేయాలని సవాలు చేశారు. కేసీఆర్ క్యాబినెట్లో నేను చీఫ్ విప్ గా, మంత్రిగా పని చేసిన విషయం రేవంత్ రెడ్డి మరిచిపోయారనుకుంట అని అన్నారు. మా నాయకుడు కేసీఆర్ అడుగు జాడల్లో మేం నడుస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేయాల్సిందేనని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ చేస్తే, తన ముఖ్యమంత్రి పదవికి ఎసరు వస్తుందని రేవంత్ రెడ్డి భయపడుతున్నాడని విమర్శించారు. బిల్లా రంగా అని మా నేతలను సంబోధించడం ద్వారా రేవంత్ సీఎం పదవి స్థాయిని తగ్గించారని అన్నారు. బిల్లా రంగాల చేష్టలు రేవంత్వే అని అన్నారు. బిల్లా రంగాల స్థాయి రేవంత్ ఎపుడో దాటి పోయారని.. చార్లెస్ శోభరాజ్ ను మించిపోయారని అన్నారు. పాలన చేత కాక పనికి రాని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
అంబేడ్కర్‌ను ఓడించి, జగ్జీవన్ రామ్‌ను అవమానించిన కాంగ్రెస్ పార్టీకి మాకు నీతులు చెప్పే అర్హత ఉందా అని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. దళితులకు రెండు సార్లు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ది అని కొనియాడారు. రేవంత్‌కు దళితుల పట్ల ప్రేమ ఉంటే ఓ దళితుణ్ణి సీఎం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎప్పుడేమి చేయాలో కూడా రేవంత్ రెడ్డి చెబితే మేము ఎందుకు అని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగ్గించి పాలన మీద దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి హితవుపలికారు. సీఎం పదవి లో ఉంటూ వేరే వాళ్ళను సీఎం అనే స్థాయికి రేవంత్ వెళ్లాడంటే ఆయన మతి భ్రమించిందని అనుకోక తప్పదని అన్నారు. ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పిన చేవెళ్ల దళిత డిక్లరేషన్ అమలు గురించి రేవంత్ ఆలోచించాలని.. బీఆర్ఎస్ నాయకత్వం గురించి తర్వాత ఆలోచించవచ్చని స్పష్టం చేశారు.